Goa Election 2022: ఆ పార్టీలతో పొత్తు కుదరలేదు.. కానీ, ఫ్రెండ్షిప్ ఉంటుంది: కాంగ్రెస్

Published : Jan 30, 2022, 04:58 PM IST
Goa Election 2022: ఆ పార్టీలతో పొత్తు కుదరలేదు.. కానీ, ఫ్రెండ్షిప్ ఉంటుంది: కాంగ్రెస్

సారాంశం

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని వెల్లడించింది. ఎన్సీపీ, శివసేనలతో తాము మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, గోవాలోనూ కలిసి బరిలోకి దిగడానికి ప్రయత్నాలు చేశామని, కానీ, ఈ రెండు పక్షాల నుంచి వచ్చిన అభిప్రాయాలు కుదరలేవని తెలిపారు. కానీ, ఆ పార్టీలతో ఫ్రెండ్షిప్ ఎన్నికల తర్వాత కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు. 

పనాజీ: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో(Goa Assembly Elections) కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP) నువ్వా నేనా అన్నట్టుగా పోటీకి దిగుతున్నాయి. కాగా, తృణమూల్ కాంగ్రెస్(TMC) కూడా తొలిసారిగా ఈ రాష్ట్ర ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ అవతరించినప్పటికీ అధికారాన్ని చేపట్టలేకపోయింది. ఈ సారి ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నది. అయితే, బీజేపీని ఓడించడానికి ఇతర ప్రతిపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకోవడంపై కాంగ్రెస్ వైఖరి ఇంకా స్పష్టం కాలేదు. తాజాగా, ఈ పొత్తులపై కాంగ్రెస్ పార్టీకి అబ్జర్వర్‌గా ఉన్న పార్టీ సీనియర్‌ నేత పి చిదంబరం స్పందించారు. ఇతర ప్రతిపక్ష పార్టీలతో జత కట్టడం(Alliance)పై పార్టీ వైఖరిని వెల్లడించారు.

మహారాష్ట్రలో కూటమిగా ఉన్న శివసేన, ఎన్సీపీతో గోవాలో కాంగ్రెస్ ఎందుకు పొత్తు పెట్టుకోవడం లేదన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. తాము పొత్తు పెట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదని తెలిపారు. పొత్తు కోసం ప్రయత్నించామని, వారు కొన్ని ప్రతిపాదనలు తెస్తే.. తాము కొన్ని ప్రతిపాదనలు తెచ్చామని వివరించారు. కానీ, ఈ ప్రతిపాదనలపై ఇరువర్గాల నుంచి ఏకాభిప్రాయం కుదరలేదని వివరించారు. అందుకే పొత్తు సాధ్యపడలేదని తెలిపారు. అయినప్పటికీ తాము మిత్ర పార్టీలుగానే ఉంటామని, ఎన్నికల తర్వాత కూడా అదే స్నేహాన్ని కొనసాగిస్తామని వివరించారు. ఎన్నికల తర్వాత కలిసి పని చేసే అవకాశాలను అన్వేషిస్తామని తెలిపారు. 

సీఎం క్యాండిడేట్ ప్రకటనపైనా స్పందించారు. గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తుందా? ఆ తర్వాతే ప్రకటిస్తుందా? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ముందుగా అభ్యర్థులు అందరినీ సంప్రదిస్తామని, ఆ తర్వాతే వారి మధ్య ఉన్న అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుందని వివరించారు. గోవాలో పోటీ బీజేపీకి, కాంగ్రెస్‌కు మధ్యనే ఉన్నాయని, అందులో కాంగ్రెస్ సింపుల్ మెజార్టీతో తప్పకుండా విజయాన్ని సాధిస్తుందని చెప్పారు.

కాగా, తృణమూల్ కాంగ్రెస్ చేస్తున్న విమర్శలపైనా కాంగ్రెస్ నేత చిదంబరం మాట్లాడారు. తృణమూల్ కాంగ్రెస్ వైఖరి ఇప్పటికీ స్పష్టంగా తెలియదని, ఒక వైపు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటామని ప్రకటిస్తూనే.. మరో వైపు తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి వారి పార్టీలోకి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నదని వివరించారు. తృణమూల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తనతో భేటీ అయ్యాడని, గోవాలో కాంగ్రెస్, టీఎంసీ కలిసి పోటీ చేయాలనే ప్రతిపాదన తన ముందుకు తెచ్చాడని తెలిపారు. తమ అధిష్టానికి దీనిపై విషయాలను చేరవేస్తానని తెలిపారు. అదే భేటీ అంశాలను కేంద్రానికి వివరించానని, కానీ, కేంద్రం నుంచి సమావేశాలు నిర్వహించడానికి ఆదేశాలు రాలేవని వివరించారు.

ఇదిలా ఉండగా, గోవా ఎన్నిక‌ల్లో పోటీ నుంచి మాజీ సీఎం, తృణ‌ముల్ కాంగ్రెస్ (tmc) జాతీయ ఉపాధ్య‌క్షుడు లూయిజిన్హో ఫలేరో (Luizinho Faleiro) వైదొలిగారు. ఆయ‌న‌కు బ‌దులుగా ఆ స్థానంలో న్యాయ‌వాది అయిన ఓ యువ‌తికి అవ‌కాశం క‌ల్పించారు. ఈ మేర‌కు శుక్ర‌వారం ఆయ‌న మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి వివ‌రాలు వెళ్ల‌డించారు. “నేను ఫటోర్డా నుండి TMC అభ్యర్థిగా ఉపసంహరించుకుంటున్నాను. ఒక ప్రొఫెషనల్ యువతికి లాఠీని అప్పగిస్తున్నాను. మహిళలకు సాధికారత కల్పించడం మా పార్టీ విధానం’’ అని ఆయ‌న పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !