2036 ఒలింపిక్స్‌ : భారత్‌లో నిర్వహించేందుకు బిడ్డింగ్ .. ప్రధాని ప్రకటన, 140 కోట్ల మంది కల అన్న మోడీ

By Siva KodatiFirst Published Oct 14, 2023, 9:25 PM IST
Highlights

2036లో జరిగే ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ బిడ్డింగ్ వేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం స్పష్టం చేశారు . 2036 ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్ని భారత్ వదిలిపెట్టదని , ఇది 140 కోట్ల మంది భారతీయుల కల అని ప్రధాని తెలిపారు.  

2036లో జరిగే ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ బిడ్డింగ్ వేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం స్పష్టం చేశారు. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సెషన్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ఈ ప్రకటన చేశారు. ఒలింపిక్స్ నిర్వహించేందుకు భారత్ చాలా ఉత్సాహంగా వుందని మోడీ పేర్కొన్నారు. 2036 ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్ని భారత్ వదిలిపెట్టదని , ఇది 140 కోట్ల మంది భారతీయుల కల అని ప్రధాని తెలిపారు. దీనితో పాటు 2029లో జరగనున్న యూత్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా వుందని ప్రధాని స్పష్టం చేశారు. ఇండియాకు ఐవోసీ నుంచి మద్ధతు లభిస్తుందని ఆయన ఆకాంక్షించారు. 

అంతకుముందు ముంబైకి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు అజిత్ పవార్ , దేవేంద్ర ఫడ్నవీస్‌లు స్వాగతం పలికారు. ఐవోసీ సెషన్ అనేది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యల కీలక సమావేశంగా పనిచేస్తుంది. ఒలింపిక్ క్రీడల భవిష్యత్తుకు సంబంధించి ఐవోసీ సెషన్‌లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సెషన్‌కు ఐవోసీ అధ్యక్షుడు థామస్ బాచ్, ఐవోసీ సభ్యలు, భారతీయ క్రీడా ప్రముఖులు, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ సహా వివిధ క్రీడా సమాఖ్యల ప్రతినిధులు హాజరయ్యారు. అలాగే బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, అలియా భట్, దీపికా పదుకొణేలు కూడా ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌కు చేరుకున్నారు. 

దాదాపు 40 ఏళ్ల విరామం తర్వాత భారత్ రెండోసారి ఐవోసీ సెషన్‌ను నిర్వహిస్తోంది. ఐవోసీ 86వ సెషన్ 1983లో న్యూఢిల్లీలో జరిగిందని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు మరింత ఆదరణ లభిస్తున్నందున 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌‌కు చోటు కల్పిస్తున్నట్లు శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఐవోసీ అధ్యక్షుడు థామస్ బాచ్ తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో వన్డే ప్రపంచకప్ విజయవంతంగా జరుగుతోందన్నారు. భారతీయులు, భారత సంతతి ప్రజలు క్రికెట్ ఆడుతారని.. ఇటీవల తాము డల్లాస్‌లోనూ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించామని బాచ్ పేర్కొన్నారు. అందువల్ల లాస్ ఏంజిల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

click me!