
లక్నో: సాధారణ ప్రజల విశ్వాసానికి ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ చిహ్నంగా నిలిచాడని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు.ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ పార్థీవదేహానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నాడు నివాళులర్పించారు. ఆదివారం నాడు ఆయన లక్నోలోని కళ్యాణ్ సింగ్ నివాసంలో మీడియాతో మాట్లాడారు.
కళ్యాణ్ సింగ్ కన్న కలలను సాకారం చేసేందుకు తాము శాయశక్తులా కృషి చేస్తామని ఆయన చెప్పారు. ఓ విలువైన సమర్ధుడైన నాయకుడిని దేశం కోల్పోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. కళ్యాణ్ సింగ్ ఆదర్శాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు.
జీవితాంతం ప్రజల సంక్షేమం కోసం ఆయన పాటుపడ్డారని మోడీ చెప్పారు. ఏ స్థాయి పదవిలో ఉన్నా కూడ ఆయన ప్రజల కోసం పనిచేసేవాడన్నారు. తాను చేపట్టిన ప్రతి పనిలో కూడ బాధ్యతాయుతంగా పనిచేశాడని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న కళ్యాణ్ సింగ్ శనివారం నాడు రాత్రి లక్నోలోని ఆసుపత్రిలో మరణించాడు. కళ్యాణ్ సింగ్ భౌతిక కాయానికి సోమవారం నాడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.