ఉజ్వల యోజన 2.0 ప్రారంభించిన ప్రధాని.. కోటి కుటుంబాలకు ఊరట

By telugu teamFirst Published Aug 10, 2021, 1:42 PM IST
Highlights

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉజ్వల యోజన పథకం రెండో విడతను ప్రారంభించారు. ఇందులో భాగంగా కొత్తగా పది కోట్ల కుటుంబాలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు అందుబాటులోకి రానున్నాయి. యూపీలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు పాల్గొన్నారు.

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఉజ్వల యోజన పథకం రెండో విడతను ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని ఆన్‌లైన్‌లో పాల్గొని పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మలు పాల్గొన్నారు. ప్రధాని పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఉచిత ఎల్పీజీ కనెక్షన్, గ్యాస్ పొయ్యిలను లబ్దిదారులకు అందించారు. 

కోటి కుటుంబాలకు లబ్ది
ఉజ్వల యోజన 2.0 కింద అదనంగా కోటి కుటుంబాలకు ఉచిత కనెక్షన్లు ఇవ్వాలని కేంద్రం సంకల్పించింది. 2021-22 కేంద్ర బడ్జెట్‌లో కేంద్రం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. రెండో దఫా పథకంలో లబ్దిదారులు ఫస్ట్ రీఫిల్లింగ్‌కూ చెల్లించాల్సిన అవసరం లేదు. తొలి విడత కంటే
సులువుగా నమోదు చేసుకోవచ్చు. వలస వచ్చినవారు రేషన్ కార్డు లేదా అడ్రస్ ప్రూఫ్‌లు సమర్పించాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుంది.

ప్రధానమంత్రి ఉజ్వల యోజనను 2016 మే 1న ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌ నుంచి ఉజ్వల పథకానికి శ్రీకారం చుట్టారు. రెండో విడత కూడా ఇక్కడి నుంచే ప్రారంభించడం గమనార్హం. గ్రామీణ ప్రజలకు ఎల్పీజీని చేరువ చేసే లక్ష్యంతో ఉజ్వల యోజనను ప్రభుత్వం తెచ్చింది. 2020 మార్చి వరకు ఎనిమిది కోట్ల కుటుంబాలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చే లక్ష్యాన్ని కేంద్రం పెట్టుకుంది. ఈ
టార్గెట్‌ను ఏడు నెలల ముందే సంపూర్తి చేసింది.

click me!