
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా కొత్త వ్యవసాయ చట్టాలు, టీకా, తదితర అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓపెన్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు రాజకీయ దుర్నీతి, తెలివైన మోసాలకు నిదర్శనమని ప్రధాని మోడీ విమర్శించారు. రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసమే ఈ చట్టాలను తెచ్చినట్లు మరోసారి స్పష్టం చేశారు ప్రధాని .
మళ్లీ ప్రభుత్వ ఏర్పాటు చేయాలన్న ఒకే ఒక్క మోడల‌్‌తో గత ప్రభుత్వాలు పనిచేశాయని మోడీ ఎద్దేవా చేశారు. కానీ తమ ప్రాథమిక ఆలోచన మాత్రం వేరుగా ఉంటుందన్నారు. దేశ నిర్మాణం కోసమే ప్రభుత్వాలు పనిచేయాలని తాము విశ్వసిస్తామని.. చిన్న, సన్నకారు రైతుల సాధికారతే మా లక్ష్యమని ప్రధాని స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాలపై ఏవైనా అభ్యంతరాలంటే కూర్చొని మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న మోడీ... ఇప్పటికే పలుమార్లు రైతు సంఘాలతో చర్చలు జరిపామని గుర్తుచేశారు.
కానీ ఏ విషయంలో అభ్యంతరాలున్నాయో ఇప్పటి వరకు ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోయారని ప్రధాని దుయ్యబట్టారు. గతంలో జీఎస్టీ.. ఇప్పుడు ఆధార్, పార్లమెంట్ భవనం విషయంలోనూ అలానే చేస్తున్నారని ప్రతిపక్షాలకు చురకలు వేశారు. ఈ నిర్ణయాలను వ్యతిరేకించే వారు తమ సొంత ప్రయోజనాల కోసం చూస్తున్నారని మోడీ ఆరోపించారు. మోడీ విఫలమయ్యారా? విజయమంతమయ్యారా? అనేది ముఖ్యం కాదని.. మన దేశం విజయవంతమవుతుందా? లేదా? అన్నదే చూడాలని ప్రధాని పేర్కొన్నారు.