అమరీందర్‌పై 78 మంది ఎమ్మెల్యేలకు విశ్వాసం లేదు.. అందుకే తొలగింపు : కాంగ్రెస్ కీలక ప్రకటన

By Siva KodatiFirst Published Oct 2, 2021, 8:13 PM IST
Highlights

పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన సంక్షోభం ఇంకా రగులుతూనే వుంది. పీసీసీ చీఫ్‌గా సిద్ధూ నియామకం, అమరీందర్ సింగ్ రాజీనామా, మళ్లీ తాజాగా సిద్ధూ రాజీనామాతో వాతావరణం మరింత హీటెక్కింది. ఈ నేపథ్యంలో పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ రాజీనామా వ్యవహారంపై కాంగ్రెస్‌ పార్టీ శనివారం కీలక అంశాన్ని బయటపెట్టింది

పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన సంక్షోభం ఇంకా రగులుతూనే వుంది. పీసీసీ చీఫ్‌గా సిద్ధూ నియామకం, అమరీందర్ సింగ్ రాజీనామా, మళ్లీ తాజాగా సిద్ధూ రాజీనామాతో వాతావరణం మరింత హీటెక్కింది. ఈ నేపథ్యంలో పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ రాజీనామా వ్యవహారంపై కాంగ్రెస్‌ పార్టీ శనివారం కీలక అంశాన్ని బయటపెట్టింది. పంజాబ్‌లో తమ పార్టీకి మొత్తం 78 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. వారిలో 78మంది అమరీందర్‌ సింగ్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేసినట్టు కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా తెలిపారు. ఈ మేరకు హైకమాండ్‌కు ఎమ్మెల్యేలు లేఖలు రాసినట్టు వెల్లడించారు. 78 మంది ఎమ్మెల్యేల విశ్వాసం కోల్పోయిన ఏ ముఖ్యమంత్రి అయినా తనకు తానుగా పదవి నుంచి దిగిపోవాల్సి ఉంటుందని అని ఈ సందర్భంగా సూర్జేవాలా వ్యాఖ్యానించారు.

మరోవైపు అమరీందర్  సింగ్  పార్టీ మారే వరకు విషయం వెళ్లడంతో .. అనూహ్యంగా పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు సిద్ధూ. అయితే పార్టీ పెద్దలు బుజ్జగించడంతో ఆయన తన నిర్ణయంపై పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సిద్ధూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రిల సిద్ధాంతాలను మరింత ముందుకు తీసుకెళతానని తెలిపారు. తాను పదవిలో ఉన్నా, లేకపోయినా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల వెన్నంటే ఉంటానని సిద్దూ స్పష్టం చేశారు. ప్రతికూల శక్తులన్నీ ఏకమై తనను ఓడించేందుకు ప్రయత్నించనివ్వండి... కానీ పాజిటివ్ ఎనర్జీలోని ప్రతి అణువు ఉప్పొంగి పంజాబ్ ను గెలిపిస్తుందని సిద్ధూ ట్వీట్ చేశారు. 
 

click me!