
వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై జిల్లా కలెక్టర్లతో (district magistrates) ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ (ys jagan) సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి సీఎం జగన్ తీసుకున్న చొరవ అభినందనీయమని మోడీ ప్రశంసించారు. యువ అధికారులను సుదీర్ఘకాలం నియమించడంతో జిల్లాల అభివృద్ధికి తోడ్పడుతున్నారని ప్రధాని కొనియాడారు.
సెలవురోజు సైతం సీఎంలు సమావేశానికి హాజరుకావడం వారి చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే వెనుకబడిన జిల్లాల అభివృద్ధి వేగవంతం అవుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా దేశంలో పలు జిల్లాలు చాలా వెనుకబడి వున్నాయని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాల అభివృద్దికి ఎదురవుతున్న అడ్డంకులను తొలగించాలని మోడీ అన్నారు. సాంకేతికతతో అభివృద్ధిని పరుగులు పెట్టించాలని ప్రధాని పిలుపునిచ్చారు.
సుపరిపాలనను అందించడంలో జిల్లా యంత్రాంగం కీలకపాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాలను మరింత మెరుగైన రీతిలో అమలు చేసేందుకు ఇది దోహదపడుతుందని.. క్షేత్రస్థాయి పర్యటనలు, తనిఖీల కోసం వివరణాత్మక మార్గదర్శకాలను రూపొందించాలని మోడీ కోరారు. కేంద్రం, రాష్ట్రాలు, స్థానిక పరిపాలనల టీమ్‌వర్క్ ఆశించిన జిల్లాలలో మంచి ఫలితాలను ఇస్తోందని ప్రధాని అన్నారు.
తమ ప్రయత్నాలతో ప్రజల జీవితాలు మెరుగుపడడాన్ని చూసినప్పుడు జిల్లాల్లోని అధికారులు ఎంతో సంతృప్తిని పొందుతున్నారని మోడీ పేర్కొన్నారు. ప్రతి జిల్లా కూడా ఇతరుల విజయాల నుండి నేర్చుకోవాలని.. సవాళ్లను కూడా విశ్లేషించాలని ప్రధాని పిలుపునిచ్చారు. 22 రాష్ట్రాల్లోని 142 జిల్లాలు కేవలం ఒకటి లేదా రెండు అంశాలలో వెనుకబడి ఉన్నాయని ప్రభుత్వం గుర్తించిందని.. దాన్ని పరిష్కరించడాన్ని అధికారులు సవాలుగా తీసుకోవాలని మోడీ కోరారు.