Latest Videos

రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన ప్రధాని మోదీ...

By Arun Kumar PFirst Published May 24, 2024, 10:33 AM IST
Highlights

తన రిటైర్మెంట్ పై జరుగుతున్న ప్రచారంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఎప్పటివరకు రాజకీయంగా యాక్టివ్ గా వుంటారో మోదీ క్లారిటీ ఇచ్చారు. 

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు వాడీవేడిగా సాగుతున్నాయి. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతుండగా ఇప్పటికే ఐదు దశల పోలింగ్ పూర్తయ్యింది. మిగతా రెండు దశల పోలింగ్ కూడా త్వరలోనే ముగియనుంది... జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లోనూ మళ్లీ బిజెపిదే విజయమని... నరేంద్ర మోదీ హవా, హిందుత్వ రాజకీయాల ముందు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి నిలవలేదని ప్రచారం జరుగుతోంది. మళ్లీ ప్రధాని పీఠాన్ని అధిరోహించేది నరేంద్ర మోదీయే అనే ప్రజాభిప్రాయం కూడా గట్టిగా వినిపిస్తోంది. ఇలాంటి తరుణంలో ప్రతిపక్షాలు కొత్త వాదనను తీసుకువచ్చాయి... అదే మోదీ పొలిటికల్ రిటైర్మెంట్.  

ప్రధాని నరేంద్ర మోదీ 1950  సెప్టెంబర్ 17న జన్మించారు. అంటే ప్రస్తుతం అతడి వయసు 73 ఏళ్ళు. అయితే రాజకీయంగా కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు బిజెపి ఓ నిబంధనను పెట్టుకుందన్నది ప్రచారం. 75 ఏళ్లు పైబడిన నాయకులను యాక్టివ్ రాజకీయాల నుండి తప్పుకోవాలన్నదే ఆ రూల్. కాబట్టి మోదీ మరో రెండేళ్లలో రాజకీయాల నుండి రిటైర్ కానున్నారంటూ ప్రతిపక్షాల ప్రచారం చేస్తున్నాయి. దీన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి మోదీ హవాను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు మోదీ, బిజెపి రాజకీయ ప్రత్యర్థులు.

ఇటీవల డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన కామెంట్స్ తో ప్రధాని మోదీ రిటైర్మెంట్ పై చర్చ మరింత తీవ్రమయ్యింది. నిజంగానే మోదీ రెండేళ్ళలో రాజకీయాలకు  దూరం కానున్నారా? ప్రతిపక్షాలు చెబుతున్నట్లు ఈసారి బిజెపి గెలిచినా మోదీ పూర్తికాలం ప్రధానిగా వుంటారా? ఆయన తప్పుకుంటే తర్వాతి ప్రధాని ఎవరు? అనే ప్రశ్నలు ప్రజల్లో మెదులుతున్నాయి. అయితే తాజాగా ఈ అనుమానాలన్నింటిని పటాపంచలు చేస్తూ తన రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చారు నరేంద్ర మోదీ. 

 రిటైర్మెంట్ పై నరేంద్ర మోదీ ఏమన్నారు..: 
 
భారతదేశాన్ని అభివృద్ది పథంలో నడిపించే బాధ్యతను ఆ దేవుడు తనపై పెట్టారని ప్రధాని మోదీ అన్నారు. ప్రస్తుతం దేశం 'వికసిత్ భారత్' వైపు అడుగులు వేస్తోందని...  2047 నాటికి గమ్యానికి చేరుకుంటామని అన్నారు. అప్పటివరకు ఆ దేవుడు తనను పైకి పిలవడంటూ చమత్కరిస్తూనే రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చారు మోదీ. అంటే మరో రెండు దశాబ్దాల పాటు యాక్టివ్ రాజకీయాల్లో వుంటానని చెప్పకనే చెప్పారు మోదీ.  

ఇలా ప్రధాని నరేంద్ర మోదీ తన రాజకీయ భవిష్యత్ పై ప్రతిపక్షాలు చేస్తున్న కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. తనపై నమ్మకముంచి బిజెపికి ఓటేసి గెలిపించాలని ... పూర్తికాలం ప్రధానిగా కొనసాగుతానని పరోక్షంగా వెల్లడించారు. 

ఈసారి భారీ లోక్ సభ స్థానాల్లో విజయంపై కన్నేసిన బిజెపి ''అబ్ కి బార్ 400 కి పార్ (400 లకు పైగా స్థానాల్లో విజయం)'' నినాదంతో ఎన్నికలకు వెళుతోంది. ఈ క్రమంలోనే నరేంద్ర మోదీ చరిష్మాను  ఉపయోగించుకుంటోంది బిజెపి నేతృత్వంలోని ఎన్డిఏ కూటమి. దేశవ్యాప్తంగా మోదీ ప్రచారం చేపడుతుంటే ప్రజాస్పందన కూడా అలాగే వుంది.. ఎక్కడికి వెళ్లినా ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో మోదీపై ప్రజల్లో ఏర్పడిన నమ్మకాన్ని తగ్గించలేమని ప్రతిపక్షాలకు అర్థమయ్యింది... అందువల్లే ఆయన రిటైర్ కానున్నారంటూ ప్రచారాన్ని ప్రారంభించాయి. 

డిల్లీ సీఎం కేజ్రీవాల్ కామెంట్స్ : 

ఇటీవల డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మోదీ రిటైర్మెంట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 75 ఏళ్లు పైబడిన నాయకులను యాక్టివ్ రాజకీయాలకు దూరంగా వుంచుతోంది బిజెపి... ఇలా ఇప్పటికే అద్వానీ, మురళీమనోహర్ జోషి వంటివారిని పక్కనబెట్టారని కేజ్రీవాల్ గుర్తుచేసారు. కాబట్టి మరో రెండేళ్లలో మోదీ కూడా రాజకీయాలకు దూరం కానున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. మోదీ తర్వాత బిజెపిలో సెకండ్ ప్లేస్ లో వున్న అమిత్ షా ప్రధాని పగ్గాలు చేపడతారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. 

కేజ్రీవాల్ వ్యాఖ్యలపై అమిత్ షా రియాక్షన్ :

ప్రజల్లో మోదీ మేనియా తగ్గించేందుకే కేజ్రీవాల్ కామెంట్ చేసారని బిజెపి గుర్తించింది. దీంతో వెంటనే అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ వంటి సీనియర్లు కేజ్రీవాల్ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు. ముచ్చటగా మూడోసారి కూడా నరేంద్ర మోదీ ప్రధాని పీఠాన్ని అధిరోహిస్తారని... పూర్తి పదవీకాలం ఆయనే కొనసాగుతారని కేంద్ర హోమంత్రి స్పష్టం చేసారు. భవిష్యత్ లో కూడా మోదీ ప్రధానిగా కొనసాగుతారు... ఈ విషయంలో బిజెపిలో ఎలాంటి గందరగోళం లేదన్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. దేశ ప్రధానిగా మోదీ, ఉత్తర ప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ కొనసాగుతారని రాజ్ నాథ్ తెలిపారు. 

click me!