కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్సీపై దాడి.. పథకం ప్రకారమే అని ఆరోపణ.. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

By Sumanth KanukulaFirst Published Feb 9, 2023, 3:48 PM IST
Highlights

మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రద్న్య రాజీవ్ సతావ్‌పై దాడి జరిగింది. ఓ వ్యక్తి వెనకాల నుంచి వచ్చి ఆమెపై దాడి చేశాడు.

మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రద్న్య రాజీవ్ సతావ్‌పై దాడి జరిగింది. ఓ వ్యక్తి వెనకాల నుంచి వచ్చి ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. అయితే ప్రద్న్య రాజీవ్ సతావ్‌పై దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్టుగా గురువారం ఒక అధికారి తెలిపారు. అయితే ఈ దాడి గురించి వెల్లడించిన ప్రద్న్య రాజీవ్ సతావ్.. గుర్తుతెలియని వ్యక్తి తనపై వెనుక నుంచి దారుణంగా దాడి చేశాడని పేర్కొన్నారు. తనను తీవ్రంగా గాయపరిచాడని.. తన ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పారు. తనపై జరిగిన దాడి ప్రజాస్వామ్యం జరిగిన దాడి అని అన్నారు. గత ఏడాది నవంబర్ తర్వాత తనపై దాడి జరగడం ఇది రెండోసారి అని.. తనకు మరింత భద్రత కల్పించాలని కోరారు. 

ప్రజాజీవితంలో ఉన్న మహిళలపై ఇలాంటి దాడులను అరికట్టాలని.. అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతానని ప్రద్న్య రాజీవ్ సతావ్‌ తెలిపారు. ‘‘నాపై దాడి చేసిన వ్యక్తిని ఎవరో పంపారని నేను అనుమానిస్తున్నాను. ఈ దాడి వెనుక రాజకీయ కుట్ర లేదని పోలీసులు నాకు చెప్పారు. కానీ దుండగుడు నిన్న రాత్రి నా వాహనం దగ్గరకు వచ్చినప్పుడు, అతను ‘కారులో ఉన్న మేడమ్ ఎవరు’ అని అడిగాడు. అంటే అతడు నా కోసం ప్రత్యేకంగా వెతుకుతున్నాడు. నేను నా వాహనాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లమని డ్రైవర్‌ని అడిగాను. ఆ తర్వాత నా కోసం వేచి ఉన్నవారిని కలవడానికి కారు నుంచి బయటకు వచ్చాను. అయితే దుండగుడు నన్ను అనుసరించి వెనుక నుండి దాడి చేశాడు’’ అని ప్రద్న్య చెప్పారు.

ఇక, ఘటనకు సంబంధించి ఎమ్మెల్సీ ప్రద్న్య రాజీవ్ సతావ్‌ ఫిర్యాదు మేరకు మహేంద్ర డొంగార్‌దివ్‌ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘‘ మత్తులో ఉన్న వ్యక్తి, కస్బే ధావండాలో  ఎమ్మెల్సీ ప్రద్న్య సతావ్‌పై వెనుక నుంచి దాడి చేసాడు. బాలాపూర్ పోలీస్ స్టేషన్‌లో నిందితుడు డోంగార్‌డివ్‌పై ఐపీసీలోని సెక్షన్‌లు 352, 353, 323ల కింద కేసు నమోదు చేయబడింది’’ హింగోలి పోలీసు సూపరింటెండెంట్ జి శ్రీధర్‌ తెలిపారు. 

click me!