ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌లోని పార్వతీ కుండ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రార్థనలు చేశారు.
ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌లోని పార్వతీ కుండ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రార్థనలు చేశారు. ప్రధాని మోదీ మోదీ గురువారం ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌కు ఒక రోజు పర్యటన నిమిత్తం చేరుకున్నారు. ఈ క్రమంలోనే మోదీ.. పితోర్‌గఢ్‌లోని పార్వతీ కుండ్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తలపాగాతో పాటు పూర్తి స్థానిక సాంప్రదాయ దుస్తులను ధరించి ప్రధాని మోదీ ఈ పూజల్లో పాల్గొన్నారు. ఢమరుకం, శంఖానాదాలతో పరమేశ్వరుడిని అర్చించారు.
జోలింగ్‌కాంగ్‌లోని పార్వతి కుండ్ ఒడ్డున ఉన్న శివ-పార్వతీ ఆలయంలో కూడా ప్రధాని మోదీ పూజలు నిర్వహించారు. ఆ తర్వాత శివుని నివాసమైన ఆది కైలాస శిఖరం ముందు మోదీ కొద్దిసేపు ధ్యానం చేశారు.
ఇక, ఇందుకు సంబంధించి ప్రధాని మోదీ ‘‘ఎక్స్’’లో ఓ పోస్టు చేశారు. ‘‘ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్‌లోని పవిత్ర పార్వతి కుండ్‌లో దర్శనం, పూజలతో నేను పొంగిపోయాను. ఇక్కడి నుంచి ఆది కైలాస దర్శనంతో మనసు కూడా సంతోషిస్తుంది. ప్రకృతి ఒడిలో నెలకొని ఉన్న ఆధ్యాత్మికత, సంస్కృతికి సంబంధించిన ఈ ప్రదేశం నుంచి మన దేశంలోని కుటుంబ సభ్యులందరూ సంతోషకరమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించాను’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఇక, ప్రధాని మోదీ.. సరిహద్దు గ్రామమైన గుంజిని సందర్శించి అక్కడ సైన్యం, ఐటీబీపీతో పాటు స్థానిక ప్రజలతో సంభాషించనున్నారు. అలాగే పితోర్‌గఢ్‌లో రూ. 4,200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంబోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో కూడా ప్రసంగించనున్నారు.
ఈ పర్యటనకు ముందు మోదీ ‘‘ఎక్స్’’లో స్పందిస్తూ.. ‘‘మా ప్రభుత్వం దేవభూమి ఉత్తరాఖండ్‌లోని ప్రతి ఒక్కరి సంక్షేమానికి, రాష్ట్ర వేగవంతమైన అభివృద్ధికి కట్టుబడి ఉంది. దానికి మరింత వేగాన్ని అందించడానికి, నేను పితోర్‌గఢ్‌లో అనేక ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నాను. గుంజి గ్రామ ప్రజలతో మమేకమయ్యే మంచి అవకాశం కూడా నాకు లభిస్తుంది. ఆధ్యాత్మికంగా ప్రాముఖ్యమైన పార్వతీ కుండ్ దర్శనం కోసం, జగేశ్వర్ ధామ్‌లో పూజ కోసం కూడా నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని పేర్కొన్నారు.