₹2700 కోట్లతో నిర్మించిన 12 కి.మీ. పొడవైన సోనమార్గ్ టన్నెల్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దీంతో శ్రీనగర్, లేహ్ మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించనున్నారు. కేంద్ర పాలిత ప్రాంతంలోని సోనమార్గ్‌లో నిర్మించిన టన్నెల్‌ను ప్రారంభించి.. బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ₹2700 కోట్లతో 12 కిలో మీటర్ల పొడవున ఈ టన్నెల్‌ని నిర్మించారు.
ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్ పర్యటన ఇలా సాగనుంది. మోదీ సోమవారం ఉదయం 11.30 గంటలకు సోనమార్గ్ చేరుకుంటారు. 11.45 గంటలకు టన్నెల్‌ను ప్రారంభించి, పరిశీలిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శనివారం సోనమార్గ్ టన్నెల్‌ను పరిశీలించారు.
కాగా, సోనమార్గ్ టన్నెల్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో సోనమార్గ్ టన్నెల్ ఫోటోలు, వీడియోలను షేర్ చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని సోన్‌మార్గ్‌లో జరిగే సొరంగం ప్రారంభోత్సవం కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. పర్యాటకంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థకు కలిగే ప్రయోజనాలను మీరు సరిగ్గానే ఎత్తి చూపారంటూ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సోనమార్గ్ టన్నెల్ పరిశీలించిన ఫొటోలను షేర్ చేశారు.
I am eagerly awaiting my visit to Sonmarg, Jammu and Kashmir for the tunnel inauguration. You rightly point out the benefits for tourism and the local economy.
Also, loved the aerial pictures and videos! https://t.co/JCBT8Ei175
— Narendra Modi (@narendramodi)
12 కి.మీ. పొడవైన సోనమార్గ్ టన్నెల్ ప్రాజెక్ట్ ₹2700 కోట్లతో పూర్తయింది. ప్రధాన టన్నెల్‌తో పాటు, ఎగ్జిట్ టన్నెల్, అనుసంధాన రహదారి కూడా ఇందులో ఉన్నాయి. శ్రీనగర్, సోనమార్గ్ మధ్య, సముద్ర మట్టానికి 8,650 అడుగుల ఎత్తులో ఈ ప్రాజెక్ట్ ఉంది. లేహ్‌కు వెళ్లే దారిలో ఇది అన్ని కాలాల్లోనూ అందుబాటులో ఉండే ప్రధాన మార్గం. భూకంపాలు, మంచు ప్రమాదాల వల్ల రహదారులు మూసుకుపోయే పరిస్థితి ఇక ఉండదు. వ్యూహాత్మకంగా కీలకమైన లడఖ్ ప్రాంతానికి సురక్షితంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రయాణించవచ్చు. సోనమార్గ్‌లో పర్యాటకాన్ని, శీతాకాల పర్యటనలను, సాహస క్రీడలను, స్థానిక ఉపాధిని పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.