
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు(Corona Cases) వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా సుమారు 1.60 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా ఒమిక్రాన్ (Omicron Variant) కేసులు 552 రిపోర్ట్ అయ్యాయి. దీంతో ఒమిక్రాన్ కేసులూ 3,623కి పెరిగాయి. వారం క్రితం 24 గంటల్లో కరోనా కేసులు 27,553 కేసులు నమోదయ్యాయి. కానీ, వారం తిరిగే లోగా లక్షన్నరను దాటి కేసులు నమోదు కావడం కలకలం రేపుతున్నది. దీంతో ఒక్క ఉదుటున యాక్టివ్ కేసులూ పెరిగాయి. ప్రస్తుతం మన దేశంలో కరోనా వైరస్ క్రియాశీలక కేసులు సుమారు ఆరు లక్షలు (5.90లక్షలు) ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను నిన్న ఎన్నికల సంఘం విడుదల చేసింది. కాగా, పరిస్థితులు గంభీరంగా మారుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) ఈ రోజు సాయంత్రం దేశంలోని కరోనా కేసుల అంశాన్ని సమీక్షించనున్నారు (Review Meeting). కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో అమలు చేయాల్సిన కఠిన ఆంక్షలు, లాక్‌డౌన్ వంటి విషయాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నదని కొన్ని వర్గాలు చెప్పాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆయన ఉన్నత అధికారులతో దేశంలోని కరోనా పరిస్థితులపై వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. అవసరమైన సలహాలను సూచించనున్నారు. ఈ రోజు సాయంత్రం ఈ సమావేశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కరోనా పరిస్థితులను ప్రధాని మోడీ చివరిసారి డిసెంబర్ 24వ తేదీన నిర్వహించారు. దేశంలో థర్డ్ వచ్చే ముప్పు ఉన్నదని చర్చ జరుగుతున్న తరుణంలో ఆయన ఈ సమావేశంలో ప్రజలకు పలు సూచనలు చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, జాగరూకతగా వ్యవహరించాలని సూచించారు. కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని వివరించారు. కరోనా మహమ్మారిపై పోరాటం ఇంకా ముగియలేదని, ఇప్పటికీ చాలా జాగ్రత్తగా ముందు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. అప్పుడు దేశంలో యాక్టివ్ కేసులు 80 వేలు ఉన్నాయి. కానీ, నేడు అవి ఆరు లక్షలకు చేరువయ్యాయి. అదీగాక, కరోనాపై ముందుండి పోరాటే ఫ్రంట్ లైన్ వారియర్స్‌లోనూ చాలా మంది ఈ మహమ్మారి బారిన పడుతుండటం ఆందోళనకరంగా మారింది.
కరోనా పరిస్థితులు రోజు రోజుకూ కఠినంగా మారుతుండటంతో ప్రజల్లో భయాందోళనలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శాసన సభా గడువు ముగుస్తున్న ఐదు రాష్ట్రాలకు ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల నిర్వహిస్తామని స్పష్టం చేసింది. అసంబ్లీ ఎన్నికల నిర్వహణ నుంచి వెనుకడుగు వేయడం లేదని వివరించింది. నిన్ననే ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు తేదీలన ప్రకటించింది. యూపీ, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఏడు షెడ్యూల్‌లలో ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఒక్క యూపీలో మాత్రమే ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. కరోనా కేసుల నేపథ్యంలో జనవరి 15వ తేదీ వరకు ఎన్నికల ర్యాలీలపై నిషేధం విధించింది. ఆ తర్వాతే ఈ నిర్ణయాన్ని మరోసారి సమీక్షిస్తామని తెలిపింది.