
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన తొమ్మిదేళ్ల పాలనలో ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకున్నారు. అదే సమయంలో ప్రపంచ పటంలో భారత కీర్తిని మరింతగా పెంచారు. బయటి దేశాలతో సంబంధాల విషయంలో తనదైన పంథాను కొనసాగిస్తూనే.. మరోవైపు దేశ రాజకీయాల్లో ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన అంశాలపై తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే అవినీతి, బంధుప్రీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు దేశ ప్రజలను సన్నద్దం చేస్తున్నారు. పలు వేదికల నుంచి పలు సందర్భాల్లో ఈ మేరకు దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిస్తూనే ఉన్నారు.
భారత రాజకీయాల్లో బంధుప్రీతి అధికంగానే కనిపిస్తూనే ఉంది. కొందరు నేతలు రాజకీయంగా బలపడితే.. తన కుటుంబంలోని ఇతర సభ్యులను కుటుంబంలోకి తీసుకురావడం కొనసాగిస్తున్నారు. ఇది దేశంలో అవినీతి పెరిగిపోవడానికి ప్రధాన కారణంగా కూడా మారింది. ఈ కారణంగానే వివిధ రంగాల్లో అర్హులైన ప్రతిభావంతులు.. అవకాశాలకు దూరంగా ఉండిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ప్రధాని మోదీ మాత్రం.. తాను పనిచేసేది దేశం కోసం మాత్రమేనని చాటిచెబుతున్నారు.
అందుకే గత 9 ఏళ్ల పాలనలో ప్రధాని మోదీ బంధుప్రీతి, అవినీతికి పాల్పడినట్టుగా ఆయనపై ఎలాంటి ఆరోపణలు, విమర్శలు రాలేదు. ఏ సందర్భంలో కూడా ఆయన బంధుప్రీతిని ప్రదర్శించిన సందర్భాలు లేవు. తనను ప్రధానిగా చేసిన దేశ ప్రజలే తన కుటుంబమనే సందేశం ఇస్తూ ముందుకు సాగుతున్నారు. గత పాలకులు ప్రదర్శించిన బంధుప్రీతి, చేసిన అవినీతిని గురించి కూడా ఎత్తిచూపుతున్నారు.
అదే సమయంలో దేశాన్ని పట్టిపీడిస్తున్న బంధుప్రీతి, అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలను ప్రధాని మోదీ చైతన్య పరుస్తున్నారు. అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలను దేశం నుంచి తరిమికొట్టాలని.. అప్పుడే దేశం మరింత వేగంగా ముందుకు అడుగులు వేస్తుందని వివరిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం వేళ చేసే ప్రసంగాలలో కూడా ఈ విషయానికి మోదీ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. తద్వారా తనకు దేశంపై ఉన్న ప్రేమను చాటుకుంటున్నారు. అదే సమయంలో కుటుంబ పాలన చేసే రాజకీయ పార్టీల నుంచి ఆయా రాష్ట్రాల ప్రజలకు విముక్తి కల్పిస్తామనే చెప్పుకొస్తున్నారు.
ఇటీవల జరిగిన 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రసంగించిన మోదీ.. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపులకు వ్యతిరేకంగా సమిష్టిగా పోరాడాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మూడు దుర్మార్గాల వల్ల దేశానికి తీరని నష్టం వాటిల్లిందని వివరించారు. సంక్షేమ పథకాల్లో 10 కోట్ల మంది నకిలీ లబ్ధిదారులను తమ ప్రభుత్వం తొలగించిందని.. అక్రమంగా సంపాదించిన ఆస్తుల స్వాధీనం 20 రెట్లు పెరిగిందని తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం మోదీ జీవితకాల నిబద్ధత అని స్పష్టం చేశారు.
బుజ్జగింపు రాజకీయాలు సామాజిక న్యాయానికి అత్యంత హాని కలిగించాయని ప్రధాని మోదీ అన్నారు. ‘‘కుటుంబ పార్టీలు, కుటుంబం ద్వారా, కుటుంబం కోసం’’ అనే మంత్రంతో వంశపారంపర్య పార్టీలు పనిచేస్తాయని ఆయన అన్నారు. అవినీతిని ఏ రూపంలోనూ సహించకూడదని దేశం నిర్ణయించుకోవాలని కోరుతున్నారు. ‘‘సంస్కరణ, పనితీరు, రూపాంతరం..ఇది మా నినాదం’’ అని మోదీ ధైర్యం చెబుతున్నారు.