
విదేశీ పర్యటనను ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఢిల్లీకి తిరిగి వచ్చారు. ఆ వెంటనే రాజధానిలో వరదల పరిస్థితిపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాతో మాట్లాడారు. ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనల అనంతరం ఢిల్లీకి తిరిగి వచ్చిన ప్రధాని .. యమునా నదిలో పెరిగిన నీటిమట్టం తగ్గించే ప్రయత్నాలను సమీక్షించారు. యమునా నదిలో నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పట్టినప్పటికీ, దేశ రాజధానిలోని ITO వంటి అనేక లోతట్టు ప్రాంతాలు వరదల లాంటి పరిస్థితుల్లో ఉన్నాయి.
ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే.. భారత వాతావరణ విభాగం (IMD) ఢిల్లీకి మరోసారి హెచ్చరిక జారీ చేసింది. రాబోయే 4-5 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అధికారిక ప్రకటన ప్రకారం.. రెస్క్యూ ఆపరేషన్ ద్వారా ఇప్పటివరకు మొత్తం 25,478 మందిని వరద ప్రభావిత ప్రాంతాల నుండి తరలించారు. 22,803 మందిని టెంట్లు, షెల్టర్లకు తరలించినట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. అదనంగా, వరద ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలలో సహాయం చేయడానికి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) 16 బృందాలను మోహరించారు.