విపక్షాల ఆరోపణలు నన్నేం చేయలేవు.. వాళ్లే నా రక్షణ కవచం: పార్లమెంట్‌లో మోదీ ఉద్వేగపూరిత ప్రసంగం

By Sumanth KanukulaFirst Published Feb 8, 2023, 5:27 PM IST
Highlights

పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శల వర్షం కురిపించారు. యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకు దేశంలో అవినీతి రాజ్యమేలిందని విమర్శించారు.

పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శల వర్షం కురిపించారు. యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకు దేశంలో అవినీతి రాజ్యమేలిందని విమర్శించారు. దేశంలో స్కామ్‌లు, హింస చోటుచేసుకుందని ఆరోపించారు.2004-2014 మధ్యకాలంలో ప్రతి అవకాశాన్ని సంక్షోభంగా మార్చడమే యూపీఏ ట్రేడ్‌మార్క్ అని విమర్శలు గుప్పించారు. పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సమాధానమిచ్చారు. అయితే అదానీ వ్యవహారంలో జేపీసీ వేయాలని విపక్షాలు నినాదాలు చేస్తుండగానే ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ క్రమంలోనే కొన్ని విపక్ష పార్టీలో లోక్‌సభ నుంచి వాకౌట్ చేశాయి. మరోవైపు ప్రతిపక్షాలు నినాదాలకు కౌంటర్‌గా.. అధికార పక్షం ఎంపీలు ‘‘మోదీ.. మోదీ’’ అంటూ నినాదాలు కొనసాగించారు. 

ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 2జీ స్కామ్, బొగ్గు, కామన్‌‌వెల్త్ గేమ్స్.. అన్నింటిలో స్కామ్ జరిగిందని ఆరోపించారు. యూపీఏ హయాంలో దేశం తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. అవినీ ఈడీ అన్ని ప్రతిపక్ష పార్టీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చిందని.. ఓటర్లు చేయలేనిది చేసిందని సెటైర్లు వేశారు. హార్వర్డ్ మాత్రమే కాదు, ప్రపంచంలోని అన్ని పెద్ద విశ్వవిద్యాలయాలు కాంగ్రెస్ పతనంపై అధ్యయనం చేశాయని అన్నారు. 

ప్రతిపక్షాలు వారికి వారే విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని.. భారతదేశం బలహీనపడిందని,  భారతదేశం ఇతర దేశాలపై ఒత్తిడి తెస్తోందని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. వార్తాపత్రికల ముఖ్యాంశాలు లేదా టీవీ విజువల్స్ వల్ల మోడీపై ప్రజలు విశ్వాసం ఉంచలేదని అన్నారు. కానీ నా సంవత్సరాల అంకితభావం వల్ల తనపై ప్రజలు విశ్వాసం ఉంచారని చెప్పారు. కోట్లాది ప్రజల విశ్వాసం తన రక్షణ కవచం అని.. తాను 25 కోట్ల కుటుంబాలలో సభ్యుడినని.. విపక్షాల దూషణలు, ఆరోపణలతో అది విచ్ఛిన్నం కాదని తెలిపారు. విపత్కర సమయాల్లో మోదీ తమ సహాయానికి వచ్చారని ప్రజలకు తెలుసని.. మీ దూషణలు, ఆరోపణలను వారు ఎలా అంగీకరిస్తారని? అని ప్రధాని మోదీ ఉద్వేగ పూరితంగా ప్రసంగించారు.

అణగారిన, పేద, గిరిజనుల సంక్షేమం కోసం పనిచేయడమే తమ ప్రాధాన్యత అని.. అది తమ లక్ష్యమని చెప్పారు. ఓటు బ్యాంకు రాజకీయాలు దేశానికి హాని కలిగించాయని విమర్శించారు. భారతదేశ అభివృద్ధిని ఆలస్యం చేశాయని అన్నారు. వారు మధ్యతరగతి ప్రజలను పట్టించుకోలేదని అన్నారు. దేశ ప్రగతిలో మధ్య తరగతి ప్రజలదే కీలక పాత్ర అని అన్నారు. అయితే ఎన్‌డీఏ ప్రభుత్వం వారికి రక్షణ కల్పించిందని అన్నారు. 

ఆరోపణలు చేయడంలో ప్రతిపక్షం గత 9 సంవత్సరాలు వృధా చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. తొమిదేళ్లలో నిర్మాణాత్మక విమర్శల స్థానంలో బలవంతపు విమర్శలు వచ్చాయని అన్నారు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు కానీ.. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంపై తాము దృష్టి సారించామని చెప్పారు. నేడు రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు రూపాంతరం చెందుతున్నాయని అన్నారు. 70 ఏళ్లలో 70 విమానాశ్రయాలు.. కానీ 9 ఏళ్లలో 70 విమానాశ్రయాలు వచ్చాయని అన్నారు. దేశంలో జలమార్గాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. 

‘‘త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు ఇటీవల లాల్ చౌక్‌కు వచ్చిన వారు ఈరోజు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎలా తిరుగుతున్నారో చూసి ఉంటారు. 90వ దశకంలో నేనూ కశ్మీర్ వెళ్లాను. లాల్ చౌక్‌లో జెండాను ఎగురవేయాలని తీర్మానం చేయడంతో తీవ్రవాదులు నాకు నిరసనగా పోస్టర్లు వేశారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు లేకుండా వచ్చి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తానని నేను వారికి చెప్పాను. కానీ నేడు అక్కడ పరిస్థితులు మారిపోయాయి. ఈరోజు జమ్మూ కాశ్మీర్‌లో ప్రతి ఇంటికీ త్రివర్ణ పతాకం కార్యక్రమం విజయవంతమవుతోంది. ఈ రోజు శాంతి, ప్రశాంతత స్థాపించబడింది. జమ్మూ కాశ్మీర్‌పై కూడా ఇక్కడ చర్చ జరిగింది.. అక్కడ పర్యటించి ఇప్పుడే వచ్చిన వారు. మీరు అక్కడికి ఎంత సునాయాసంగా వెళ్లగలిగారో చూసి ఉండాలి’’ అని రాహుల్ గాంధీని ఉద్దేశించి మోదీ కామెంట్స్ చేశారు. 

click me!