ఒక పెద్ద నాయకుడు రాష్ట్రపతిని అవమానించారు.. వారిలో ద్వేషం బయటపడింది: ప్రధాని మోదీ

By Sumanth KanukulaFirst Published Feb 8, 2023, 4:24 PM IST
Highlights

పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సమాధానమిచ్చారు. లోక్‌సభలో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు కృతజ్ఞతలు తెలిపారు. 

పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సమాధానమిచ్చారు. లోక్‌సభలో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రపతి దూరదృష్టితో కూడిన ప్రసంగంలో దేశ ప్రజలకు మార్గనిర్దేశం చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీల ఆరోపణలపై ప్రధాని మోదీ స్పందించారు. అయితే అదానీ వ్యవహారంలో జేపీసీని ఏర్పాటు చేయాలని గత కొద్దిరోజులుగా డిమాండ్ చేస్తున్న విపక్షాలు.. ప్రధాని మోదీ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. అయితే స్పీకర్ ప్రతిపక్ష సభ్యులను వారించే ప్రయత్నం చేసిన లాభం లేకుండా పోయింది. ఈ క్రమంలో విపక్షాల నిరసనల మధ్యే ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. 

రాష్ట్రపతి ముర్ము ద్వారా ఆదివాసీ సమాజానికి గొప్ప గౌరవం దక్కిందని అన్నారు. కొందరు నేతలు రాష్ట్రపతిని ప్రసంగం కొనసాగుతున్నప్పుడు పట్టించుకోలేదని అన్నారు. ఒక పెద్ద నాయకుడు రాష్ట్రపతిని కూడా అవమానించారని విమర్శించారు. ఎస్టీలపై ద్వేషాన్ని ప్రదర్శించారని ఆరోపించారు. ఇలాంటి విషయాలు టీవీల్లో చెప్పినప్పుడు లోపల ఉన్న ద్వేషం బయటపడిందని సైటెర్లు వేశారు. తర్వాత అతడిని అతడు రక్షించుకునే ప్రయత్నం జరిగిందని ఎద్దేవా చేశారు. 

రాష్ట్రపతి ప్రసంగాన్ని ఎవరూ విమర్శించనందుకు సంతోషిస్తున్నానని చెప్పారు. రాష్ట్రపతి చెప్పిన మాటలను అంగీకరించారని అన్నారు. సభలో వాదనలు జరుగుతాయని.. అయితే అది భారతదేశానికి గర్వకారణమని మనం మర్చిపోకూడదని చెప్పారు. భారతదేశం గురించి ప్రపంచంలో సానుకూలత, ఆశ, విశ్వాసం ఉందని తెలిపారు. జీ20కి ఆతిథ్యం ఇవ్వడం గర్వించదగ్గ విషయం కానీ కొంతమంది దానిని చూసి విస్తుపోయారని విపక్షాలను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. దేశంలో రెండు-మూడు దశాబ్దాల అస్థిరత ఉందని.. అయితే ఇప్పుడు దేశంలో రాజకీయ స్థిరత్వం ఉంది, నిర్ణయాత్మక ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు. 

నాయకులు వారి అభిరుచి, స్వభావాన్ని బట్టి రాష్ట్రపతి ప్రసంగంపై మాట్లాడారనీ.. అయితే ఆ మాటలు కూడా వారి సామర్థ్యం, ఉద్దేశ్యాన్ని ప్రతిబింబిస్తాయని అన్నారు. 
దేశం పూర్తి శక్తితో ముందుకు సాగుతోందని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా భారీ పరివర్తన జరుగుతోందని తెలిపారు. భారతదేశం తయారీ కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. భారతదేశ వృద్ధిలో శ్రేయస్సును ప్రపంచం చూస్తోందని.. అయితే కొంతమంది దానిని అంగీకరించడానికి ఇష్టపడటం లేదని విమర్శించారు. 

దేశంలోని ప్రతి రంగంలోనూ ఆశలు ఉన్నాయని ప్రధాని మోదీ తెలిపారు. అయితే కొందరు మాత్రం వారికి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారనే నిరాళలో మునిగిపోయారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. 2004-2014 మధ్య దేశంలో స్కామ్‌లు, హింస చోటుచేసుకున్నాయని అన్నారు. 2004 నుంచి 2014 వరకు ప్రతి అవకాశాన్ని సంక్షోభంగా మార్చడమే యూపీఏ ట్రేడ్‌మార్క్ అని విమర్శలు గుప్పించారు. 
 

click me!