
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ(PM Modi)కి పంజాబ్(Punjab) పర్యటనలో భద్రతా వైఫల్యం(Security Lapse) ఏర్పడిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీకి మధ్య పొలిటికల్ వార్‌కు తెర లేపింది. ప్రధాని మోడీ పర్యటనకు అవసరమైన పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయలేక ఆయన ప్రాణాన్ని ప్రమాదంలో పెట్టారని బీజేపీ మండిపడింది. ఆ తర్వాత ఈ ఘటన తీరును పలు విధాలుగా చర్చకు వచ్చాయి. ప్రధాని మోడీ పర్యటనలో చివరి నిమిషంలో మార్పు వచ్చిందని, అందుకే అక్కడ రైతుల ఆందోళనను తొలగించలేకపోయామనే విధంగా పంజాబ్ ప్రభుత్వం తెలిపింది. ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతుండగానే దీనిపై సుప్రీంకోర్టు విచారించడం మొదలుపెట్టింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ ఘటనపై దర్యాప్తు మొదలైంది. అయితే, ఈ ఘటన చుట్టూ అల్లుకున్న విషయాలు, పంజాబ్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడిన స్టింగ్ ఆపరేషన్ వివరాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. రైతు ఆందోళన గురించి పంజాబ్ పోలీసులకు ముందుగానే తెలుసు అని, కానీ, వారు సకాలంలో చర్యలు తీసుకోలేదు అనే విషయం దుమారం రేపుతున్నది.
ఇండియా టుడే నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్(Sting Operation)లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా కొందరు విలేకరులు ఫెరోజ్‌పుర్ డీఎస్పీ సుఖ్ దేవ్ సింగ్, కుల్‌గడీ పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌వో, సమీపంలోని ఓ గ్రామ సర్పంచ్, ప్రధాని మోడీ సుమారు 20 నిమిషాలు నిలిచిపోవాల్సిన వచ్చిన ఏరియాలోని కొందరు షాపు ఓనర్లతోనూ రహస్యంగా మాట్లాడారు.
ప్రధాని మోడీ ఈ నెల 5వ తేదీన ఫెరోజ్‌పుర్‌కు బయల్దేరి మార్గమధ్యంలోనే రైతు ఆందోళనలతో ఓ ఫ్లై ఓవర్‌పై సుమారు 20 నిమిషాలు ఆగిపోవాల్సి వచ్చింది. ప్రధాని మోడీ షెడ్యూల్డ్ ర్యాలీ ఉన్నప్పటికీ ఇలాంటి ఆటంకాలను ముందస్తుగా అంచనా వేయడంలో ఇంటెలిజెన్స్ ఎలా విఫలమైందని ప్రశ్నించగా.. నిజానికి ఆ రిపోర్టు అదనపు డీజీపీకి చేరిందని ఫెరోజ్‌పూర్ డీఎస్పీ సుఖ్ దేవ్ సింగ్ తెలిపారు. కీలకమైన రోడ్ల దిగ్బంధించాలనే నిరసనకారులు ప్లాన్, మోడీ ర్యాలీకి బీజేపీ వర్కర్లు చేరకుండా అడ్డుకోవాలనే ప్రణాళిక గురించిన రిపోర్టులు చేరాయని పేర్కొన్నారు. జనవరి 2వ తేదీ తర్వాత కూడా నిరసనకారుల నుంచి ఉన్న ముప్పును పై అధికారులకు చేరవేశామని ఆయన వివరించారు. పోలీసులకు నిరసన గురించిన వివరాలు తెలిసినా.. నిరసనకారులు ఎలా గుమిగూడగలిగారు అని ప్రశ్నించగా.. భారతీయ కిసాన్ యూనియన్ క్రాంతికారి(ఫుల్) సంఘం అంతకు ముందే ఆందోళనకారులను పోగేసిందని వివరించారు. వారు అక్కడికి చేరుకుని బారికేడ్లను ధ్వంసం చేసినప్పుడే పై అధికారులకు వివరించామని, ఆ తర్వాత అక్కడ ధర్నాకు దిగినప్పుడూ విషయాన్ని తెలియజేశామని తెలిపారు.
ప్రధాని పర్యటనకు బయల్దేరిన రోజు ఉదయం 11. 45 గంటలకే నిరసనకారులు ఏకమై మోగా రోడ్డు వైపు బయల్దేరారని, బారికేడ్లను ధ్వంసం చేసి ప్రధాని మోడీ వస్తున్న దారిలోనే వారూ వెళ్తున్నారన్న విషయాన్ని పై అధికారులకు ముందే చేరవేశామని వివరించారు. ప్రధాని ప్రయాణించనున్న వీవీఐపీ రూట్‌ను సుమారు 200 నుంచి 215 మంది నిరసనకారులు బ్లాక్ చేశారని ఎస్ఎస్‌పీకి తెలియజేశామని డీఎస్పీ సుఖ్ దేవ్ సింగ్ తెలిపారు. సుమారు 12.50 గంటల ప్రాంతంలో సుఖ్ దేవ్‌కు భటిండా ఎస్ఎస్‌పీ నుంచి ఫోన్ వచ్చిందని, ఏమైనా ట్రాఫిక్ జామ్ ఉన్నదా అని అడగ్గా.. ఈ ఏరియా మొత్తం బ్లాక్ అయిందని వివరించానని చెప్పారు. దీంతో మనమంతా నాశనం అయిపోయినట్టే అని పేర్కొన్నట్టు తెలిపారు. ప్రధాని మోడీ కాన్వాయ్ ఆ ఏరియాకు మధ్యాహ్నం 12.52కు చేరుకుని, మధ్యాహ్నం 1.10 గంటలకు వెనుదిరిగింది. అంతేకాదు, ర్యాడికల్ సంస్థలు కొన్ని ప్రధాని పర్యటనలో ఆయనపై షూ విసిరేసిన వారికి రూ. 1 లక్ష రివార్డు ప్రకటించినట్టూ తమ దగ్గర జనవరి 4వ తేదీనే సమాచారం ఉన్నదని వివరించారు.
నిరసనకారులను చెదరగొట్టాలనే ప్రభుత్వ ఆదేశాలు తమ దగ్గర ఉంటే వారిని చెదరగొట్టేవారమని ఫెరోజ్‌పూర్‌లోని కుల్‌గడీ పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌వో బీర్బల్ సింగ్ వివరించారు.
స్పెషల్ ప్రటెక్షన్ గ్రూప్ ప్రోటోకాల్ ప్రకారం సాధారణంగా వీవీఐపీ రూట్‌కు సమీపంలో దుకాణాలు అన్నింటినీ మూసివేయాలి. కానీ, ప్రధాని మోడీ కాన్వాయ్ ఆగిన ఫ్లై ఓవర్ సమీపంలో రద్దీగా ఉండే మార్కెట్ ఎప్పటిలాగే నడిచింది. అంతేకాదు, లైసెన్స్ లేని ఓ లిక్కర్ షాప్ తెరిచే ఉంది.
ప్యారేగావ్ గ్రామ సర్పంచ్ మరో కీలక విషయాన్ని తెలిపాడు. తమ గ్రామంలోని రైతులను నిరసనకు రావాలని గురుద్వారాకు సందేశాన్ని పంపారని, ప్రధాని పర్యటనకు కొద్ది సమయం ముందే నిరసనకారులను ఇక్కడి రైతు సంఘాలు సమకూర్చాయని వివరించాడు.