
న్యూఢిల్లీ: ప్రముఖ సినీ గేయ రచయిత, కవి జావేద్ అక్తర్(Javed Akthar) మరోసారి వార్తల్లోకి వచ్చారు. ప్రధాని మోడీ(PM Modi)కి పంజాబ్‌లో ఏర్పడిన భద్రతా లోపం(Security Lapse)పై ఆయన వ్యాఖ్యలు చేశారు. బుల్లెట్ ప్రూఫ్ కారులో ఉండి.. కట్టుదిట్టమైన భద్రతలో ఉన్నప్పటికీ తనకు భద్రతా లోపం ఏర్పడినట్టు ప్రధాని మోడీ చెప్పుకుంటున్నారనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. ప్రధాన మంత్రిని విమర్శించడం పక్కన పెడితే.. ఆయన ట్వీట్.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Pakistan PM Imran Khan) చేసిన ట్వీట్(Tweets)ను పోలి(Similarities) ఉన్నది. ఇద్దరూ ప్రధాని నరేంద్ర మోడీనే లక్ష్యం చేసుకుని ట్వీట్ చేశారు. ఇద్దరి ట్వీట్లలోనూ ధర్మ సంసద్ వివాద ప్రస్తావన ఉన్నది. తొలిగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేయగా.. సుమారు నాలుగు గంటల తర్వాత జావేద్ అక్తర్ ట్వీట్ చేశారు. ఇప్పుడు వారిద్దరి ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎల్‌ఎంజీ గన్నులు చేతబూని పహారా కాస్తున్న బుల్లెట్ ప్రూఫ్ కారులో కూర్చని ఉండి కూడా ప్రాణ హానీ ఎదుర్కొన్నట్టు ప్రధాని మోడీ భావిస్తున్నారని ఆయన ట్వీట్ చేశారు. ఈ భద్రతాలోపంపై ఆయన భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సమగ్ర వివరాలు అందించడానికి సమావేశం అయ్యారు. కానీ, దేశంలోని 20 కోట్ల మంది భారతీయుల మారణ హోమానికి బహిరంగంగా పిలుపునిచ్చి బెదిరించిన ఉదంతంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని ట్వీట్ చేశారు.
కాగా, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా డిసెంబర్‌లో ఓ హిందూత్వ సదస్సులో ఇచ్చిన బెదిరింపులపై ప్రధాని మోడీ ఇంకా మౌనం వహిస్తూనే ఉన్నారని ట్వీట్ చేశారు. భారత్‌లోని మైనారిటీలను ముఖ్యంగా 20 కోట్ల ముస్లిం మారణ హోమానికి పిలుపునిస్తూ బెదిరింపులకు పాల్పడిన ఘటనపై ఇంకా మౌనం దాల్చడం వెనుక ఇతర అనుమానాలు వస్తున్నాయని, బీజేపీ కూడా ఆ పిలుపును సమర్థిస్తున్నదా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ సమాజం ఇలాంటి అంశాలపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన ట్వీట్‌ను నిన్న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో చేయగా.. జావేద్ అక్తర్ అదే రోజు సాయంత్రం 40 గంటల ప్రాంతంలో చేశారు. ఇరువురూ మారణ హోం అనే పదాన్ని ఉపయోగించారు. హరిద్వార్‌లో కొందరు ర్యాడికల్ హిందూత్వ భావజాలం కలిగి బెదిరింపులకు పాల్పడిన సదస్సును పేర్కొన్నారు. ఇరువురూ ప్రధాని మోడీ ఈ ఎపిసోడ్‌పై మౌనం వహించారని పేర్కొన్నారు.
ధర్మాన్ని రక్షించడానికి ఆయుధాలు పట్టాల్సిన ఆవశ్యకత ఉన్నదని, ముస్లిం వ్యక్తి ప్రధాని కాకుండా చూడాల్సిన అవసరం ఉన్నదని, ముస్లిం జనాబా పెరగకుండా చర్యలు తీసుకోవాలి వంటి వివాదాస్పద అంశాలపై హరిద్వార్ సదస్సులో ఉపన్యాసాలు ఇచ్చారు. ఆ ఉపన్యాసాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పంజాబ్‌లో పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ భటిండా నుంచి ఫెరోజ్‌పుర్‌కు రోడ్డు మార్గాన కాన్వాయ్‌లో వెళ్తుండగా రైతు ఆందోళనకారులు ప్రదర్శనల కారణంగా అర్ధంతరంగా ఆపేయాల్సిన ఆగత్యం ఏర్పడింది. అక్కడ భద్రతా వైఫల్యం ఏర్పడటంతో తన పర్యటనను రద్దు చేసుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తనకు ఏర్పడ్డ భద్రతా లోపం గురించి ప్రధాని మోడీ.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌లో సమావేశమై వివరించారు.