
కర్ణాటక ప్రజల ఆశీస్సులు తీసుకోవడానికి తాను ఒకటిరెండు రోజుల్లో రాష్ట్రంలో పర్యటించనున్నట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ నేతలు అక్కడి ప్రజల నుంచి ఎంతో అభిమానాన్ని పొందారని చెప్పారు. ఇది బీజేపీపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తుందని అన్నారు. కర్ణాటకలో బీజేపీ కార్యకర్తలతో ప్రధాని మోదీ ఈరోజు వర్చువల్‌గా మాట్లాడారు. రాష్ట్రంలోని 58 వేలకు పైగా బూత్‌ల నుంచి బీజేపీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. బూత్‌లో గెలిస్తే ఎన్నికల్లో గెలుపు ఖాయమని అన్నారు. బూత్ లెవల్స్‌లో విజయాన్ని నమోదు చేసేందుకు కార్యకర్తలు చేస్తున్న కృషి నిజంగా పార్టీని గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాను ఇటీవల కర్ణాటకలో పర్యటించిన సందర్భాల్లో అక్కడి ప్రజల నుండి అపారమైన ప్రేమ, ఆశీర్వాదాలు పొందానని చెప్పారు. బీజేపీపై కర్ణాటక ప్రజలకు ఉన్న లోతైన విశ్వాసాన్ని ఇది తెలియజేస్తోందని అన్నారు.
‘‘పార్టీ బూత్ స్థాయిలలో గెలవాలనుకుంటే 10 మంది మహిళలు, 10 మంది పురుషులతో కూడిన బలమైన సమూహాన్ని ఏర్పాటు చేసుకోండి. ముఖ్యంగా పేదలు, మహిళలు, యువత, దళితుల సంక్షేమానికి సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమాల గురించి కొన్ని ముఖ్యమైన రికార్డులను కొనసాగించండి. వ్యూహరచన చేయండి. మీరు మొత్తం సమాచారం, డేటాతో ప్రజల వద్దకు వెళ్లండి. ఈ సమాచారం ఇళ్లలోకి చొచ్చుకుపోయినప్పుడు దాని ప్రభావం కనిపిస్తోంది. బీజేపీని ఎందుకు ఎంచుకోవాలనేది తెలుసుకునేందుకు ప్రజలకు సహాయపడుతుంది’’ అని ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు.
ప్రపంచంలోని చాలా దేశాలు కరోనాతో పోరాడడంలో ఇబ్బందులు ఎదుర్కోన్నాయని.. కానీ భారతదేశం విజయవంతంగా కరోనాపై పోరాడిందని మోదీ అన్నారు. నేడు దేశం పేదరికంతో పోరాడుతోందని తెలిపారు. అయితే దేశం మౌలిక సదుపాయాలపై రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతోందని చెప్పారు. నేడు దేశం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా లక్షల కోట్ల రూపాయలు పంపి వడ్డీ వ్యాపారుల నుండి రైతులను కాపాడుతోందని తెలిపారు.
బీజేపీకి, ఇతర పార్టీలకు మధ్య వ్యవహార శైలిలో భారీ వ్యత్యాసం ఉందని మోదీ అన్నారు. అధికారం చేజిక్కించుకోవడమే ప్రత్యర్థుల ఎజెండా అని.. కానీ అభివృద్ధే బీజేపీ ఎజెండా అని స్పష్టం చేశారు. 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన భారతదేశం రోడ్ మ్యాప్‌పై బీజేపీ కృషి చేస్తోందని వివరించారు. కాంగ్రెస్‌కు అవినీతికి మూలం అని.. అందుకే అవినీతిని ఎదుర్కోవాలనే ఆసక్తి ఆ పార్టీకి లేదని విమర్శించారు. దేశంలో 2014 నుంచి అవినీతికి వ్యతిరేకంగా శక్తివంతమైన పోరాటం జరిగిందని అన్నారు.
గత 9 ఏళ్లలో బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉన్న ప్రతి చోటా పేద సంక్షేమ పథకాలు శరవేగంగా ఊపందుకోవడం దేశ ప్రజలకు తెలుసునని అన్నారు. బీజేపీ ప్రభుత్వం లేని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవీ విజయవంతం కాకూడదని చూస్తున్నారని విమర్శించారు. బీజేపీకి సేవ చేసే అవకాశం వస్తే అభివృద్ధి వేగం, స్థాయి రెండూ పెరుగుతాయని తెలిపారు.