5జీ ప్రారంభం.. 130 కోట్ల మంది భారతీయులకు టెలికాం పరిశ్రమ అందించిన బహుమతి: ప్రధాని మోదీ

By Sumanth KanukulaFirst Published Oct 1, 2022, 1:06 PM IST
Highlights

ఢిల్లీలో జరిగిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2022లో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో సేవలను ప్రారంభించారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 21వ శతాబ్దపు భారతదేశానికి ఇది చారిత్రాత్మకమైన రోజు అని అన్నారు.

ఢిల్లీలో జరిగిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2022లో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో సేవలను ప్రారంభించారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 21వ శతాబ్దపు భారతదేశానికి ఇది చారిత్రాత్మకమైన రోజు అని అన్నారు. 5జీ టెక్నాలజీ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని చెప్పారు. 5జీ ప్రారంభం 130 కోట్ల మంది భారతీయులకు టెలికాం పరిశ్రమ అందించిన బహుమతి అని పేర్కొన్నారు. దేశంలో కొత్త శకానికి ఇది ఒక అడుగని.. అనంతమైన అవకాశాలకు నాంది అని తెలిపారు. 5జీ సేవలు ఎన్నో అవకాశాలు కల్పిస్తాయని తెలిపారు. విద్యా నాణ్యతను పెంచుతాయని చెప్పారు. 

నూతన భారతదేశం కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే దేశంగా ఉండకుండా ఆ సాంకేతికత అభివృద్ధి, అమలులో క్రియాశీల పాత్ర పోషిస్తుందని మోదీ తెలిపారు. ప్రపంచంలోని సాంకేతిక పురోగతికి మనం నాయకత్వం వహిస్తామని అన్నారు. డిజిటల్ ఇండియా విజయం.. డివైజ్ ధర, డిజిటల్ కనెక్టివిటీ, డేటా ఖర్చులు, డిజిటల్ ఫస్ట్ అప్రోచ్ సహా 4 స్తంభాలపై ఆధారపడిందని.. వాటన్నింటిపైనా పనిచేశాంమని చెప్పారు. 

Also Read: దేశంలో 5 జీ సేవలను ప్రారంభించిన ప్రధాని మోదీ.. తొలుత 13 నగరాల్లో అందుబాటులోకి..

2014లో జీరో మొబైల్ ఫోన్లను ఎగుమతి చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు వేల కోట్ల విలువైన ఫోన్లను ఎగుమతి చేస్తున్నప్పుడు... ఈ ప్రయత్నాలు డివైజ్ ఖరీదుపై ప్రభావం చూపాయని చెప్పారు. ఇప్పుడు మనం తక్కువ ధరలో మరిన్ని ఫీచర్లను పొందడం ప్రారంభించామని తెలిపారు. దేశంలోని పేదలు కూడా ఎప్పుడూ కొత్త టెక్నాలజీలను అవలంబించడానికి ముందుకు రావడాన్ని తాను చూశానని అన్నారు. 

గతంలో 1జీబీ డేటా ధర రూ.300 ఉండగా, ఇప్పుడు ఒక్కో జీబీకి రూ.10కి తగ్గిందని గుర్తుచేశారు. ‘‘భారతదేశంలో సగటున ఒక వ్యక్తి నెలకు 14GB వినియోగిస్తున్నారు. దీనికి నెలకు దాదాపు రూ. 4200 ఖర్చు అవ్వాలి.. కానీ రూ. 125-150 మాత్రమే ఖర్చవుతుంది. ప్రభుత్వ ప్రయత్నాలే ఇందుకు కారణం. డిజిటల్ ఇండియా ప్రతి పౌరుడికి ఒక స్థలాన్ని ఇచ్చింది. అతి చిన్న వీధి వ్యాపారులు కూడా UPI సౌకర్యాన్ని ఉపయోగిస్తున్నారు. మధ్యవర్తులు లేకుండా ప్రభుత్వం పౌరుల వద్దకు చేరుకుంది. ప్రయోజనాలు నేరుగా లబ్ధిదారులకు చేరాయి’’ అని మోదీ చెప్పారు. 

‘‘టెక్నాలజీ అండ్ టెలికాం అభివృద్ధితో ఇండస్ట్రీ 4.0 విప్లవానికి భారతదేశం నాయకత్వం వహిస్తుంది. ఇది భారతదేశ దశాబ్దం కాదు, భారతదేశ శతాబ్దం. ప్రజలు 'ఆత్మనిర్భర్'గా మారాలనే ఆలోచనతో నవ్వుకున్నారు. కానీ అది పూర్తయింది. ఇది ఎలక్ట్రానిక్ ఖర్చులను తగ్గిస్తుంది. 2014లో కేవలం 2 మొబైల్ తయారీ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి.. నేడు ఆ సంఖ్య 200 తయారీ కేంద్రాలకు పెరిగింది’’ అని మోదీ తెలిపారు. 

click me!