మన రాజ్యాంగ స్ఫూర్తి యువత కేంద్రంగా ఉంది.. యావత్ ప్రపంచం దృష్టి భారత్‌పైనే: ప్రధాని మోదీ

By Sumanth KanukulaFirst Published Nov 26, 2022, 12:36 PM IST
Highlights

రాజ్యాంగ పీఠికలోని మొదటి మూడు పదాలు - We The People అనేది కేవలం పదాలు కాదని.. ఇది ఒక పిలుపు, ప్రతిజ్ఞ, ఒక నమ్మకం అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 

రాజ్యాంగ పీఠికలోని మొదటి మూడు పదాలు - We The People అనేది కేవలం పదాలు కాదని.. ఇది ఒక పిలుపు, ప్రతిజ్ఞ, ఒక నమ్మకం అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. మన రాజ్యాంగం ‘‘బహిరంగమైనది, భవిష్యత్తువాదం, ప్రగతిశీల అభిప్రాయాలకు ప్రసిద్ధి’’ అని అన్నారు. మన రాజ్యాంగం సారాంశం.. భారతదేశాన్ని ప్రజాస్వామ్యానికి మాతృకగా చేసేదని చెప్పారు. సుప్రీం కోర్టులో జరిగిన రాజ్యాంగ  దినోత్సవ వేడుకలకు మోదీ హాజరయ్యారు. ఈ వేడుక‌లో ప్ర‌ధాన మంత్రి ఈ-కోర్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన కొత్త కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. 1949లో ఇదే రోజున స్వతంత్ర భారతదేశం భవిష్యత్తుకు గొప్ప పునాదులు పడ్డాయని అన్నారు. దేశ శ్రేయస్సుకు ఆజ్యం పోసే అత్యంత శక్తివంతమైన శక్తి రాజ్యాంగమని.. యువకులు చర్చల్లో పాల్గొనాలని మోదీ పిలుపునిచ్చారు. మన రాజ్యాంగ స్ఫూర్తి యువత కేంద్రంగా ఉందని చెప్పారు. మన యువతలో అవగాహన పెంచాలని ప్రభుత్వ సంస్థలు, న్యాయవ్యవస్థలను తాను కోరుతున్నానని చెప్పారు. 

భారతదేశం తన 75 సంవత్సరాల స్వాతంత్య్ర ప్రయాణాన్ని పూర్తి చేసిన తర్వాత జరుగుతున్న ఈ రాజ్యాంగ దినోత్సవం మరింత ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్‌, న్యాయవ్యవస్థలో పని చేస్తున్న అనేక మంది 7 దశాబ్దాల భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో గొప్ప పాత్ర పోషించారని చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్‌కి, రాజ్యాంగ నిర్మాతలందరికీ నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు.

సరిగ్గా 14 ఏళ్ల క్రితం భారతదేశం తన రాజ్యాంగం, పౌరుల హక్కులను జరుపుకుంటున్నప్పుడు అమాయక ప్రజలపై శత్రువులు అత్యంత అమానవీయమైన తీవ్రవాద చర్యకు పాల్పడిన రోజు కూడా అని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ముంబై దాడిలో మరణించిన వారందరికీ తన వినయపూర్వకమైన నివాళులు అర్పిస్తున్నానని చెప్పారు.

నేటి ప్రపంచ పరిస్థితుల్లో యావత్ ప్రపంచం దృష్టి భారత్‌పైనే ఉందని మోదీ చెప్పారు. భారతదేశం వేగవంతమైన అభివృద్ధి,  వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, బలపడుతున్న గ్లోబల్ ఇమేజ్ నేపథ్యంలో ప్రపంచం మనవైపు గొప్ప అంచనాలతో చూస్తోందని తెలిపారు. భారతదేశం ముందు కొత్త అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. అన్ని అడ్డంకులను దాటుకుంటూ భారత్ ముందుకు సాగుతోందని అన్నారు. మరో వారం రోజుల వ్యవధిలోనే భారత్‌కు జీ20 అధ్యక్ష పదవి లభించనుందని.. ఇది చాలా పెద్దదని పేర్కొన్నారు టీమ్ ఇండియాగా, మనమందరం ప్రపంచం ముందు భారతదేశ ప్రతిష్టను పెంచాలని.. ఇది మన సమిష్టి కర్తవ్యం అని పేర్కొన్నారు. 

click me!