నింగిలోకి దూసుకెళ్తున్న పీఎస్‌ఎల్‌వీ-సీ54 రాకెట్.. ఈవోఎస్‌-06 ఉపగ్రహం సెపరేషన్ విజయవంతం..

By Sumanth KanukulaFirst Published Nov 26, 2022, 12:11 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ54 రాకెట్ నింగిలోకి దూసుకెళ్తోంది.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ54 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈవోఎస్‌-06 ఉపగ్రహం విభజన విజయవంతమైందని ఇస్రో ప్రకటించింది. ఈవోఎస్‌-06 ఉపగ్రహం ఉద్దేశించిన కక్ష్యలో చాలా ఖచ్చితంగా ఇంజెక్ట్ చేయబడిందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ చెప్పారు. టీమ్ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఇక, పీఎస్‌ఎల్‌వీ-సీ54 రాకెట్ 8 నానో-ఉపగ్రహాలు రెండు వేర్వేరు ఎస్‌ఎస్‌పీవోలలో ప్రవేశపెట్టనుంది. మిషన్ ఇంకా కొనసాగుతుందని ఇస్రో ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.

పీఎస్‌ఎల్‌వీ-సీ54 రాకెట్‌ను శనివారం ఉదయం 11.56 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగం విజయవంతం కావడంపై శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ రాకెట్‌ భారత్‌కు చెందిన 960కిలోల ఈవోఎస్‌-06 (భూమి పరిశీలన ఉపగ్రహం - 06)తో పాటు మరో 8 నానో ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లింది.

నానో ఉపగ్రహాల జాబితాలో భారత్‌, భూటాన్‌ సంయుక్తంగా రూపొందించిన భూటాన్‌ శాట్‌, పిక్సెల్‌ సంస్థ తయారు చేసిన ఆనంద్‌ శాట్‌, ధ్రువ స్పేస్‌ సంస్థ రూపొందించిన రెండు థైబోల్ట్ శాట్‌లు, అలాగే అమెరికాకు చెందిన స్పేస్‌ ఫ్లైట్‌ సంస్థకు చెందిన నాలుగు అస్ట్రోకాస్ట్‌ ఉపగ్రహాలు ఉన్నాయి. ఇక, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్-06 (ఈవోఎస్‌-06) అనేది ఓషన్‌శాట్ సిరీస్‌లోని మూడవ తరం ఉపగ్రహం. ఇది ఓషన్‌శాట్-2 స్పేస్‌క్రాఫ్ట్ కొనసాగింపు సేవలను మెరుగైన పేలోడ్ స్పెసిఫికేషన్‌లతో పాటు అప్లికేషన్ ఏరియాలతో అందించడానికి రూపొందించబడింది.

click me!