
ప్రధాని నరేంద్ర మోదీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. గుజరాత్‌లో ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో ప్రధాని మోదీ గురువారం వర్చువల్‌గా మాట్లాడారు. ఒక వ్యక్తి తన కుమార్తె డాక్టర్ కావాలనే కల గురించి చెప్పిన సందర్భంలో.. ప్రధాని మోదీ ఉద్వేగానికి లోనయ్యారు. మరోవైపు ఈ కార్యక్రమానికి హాజరైన ఆ వ్యక్తి కూతురు కూడా భావోద్వేగానికి గురైంది. వివరాలు.. గుజరాత్‌లోని ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోదీ లబ్ధిదారులతో మాట్లాడి వారి అనుభవాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఇలా మాట్లాడుతున్న సమయంలో.. అయూబ్ పటేల్ అనే లబ్దిదారుడితో కూడా మోదీ ముచ్చటించారు. ఈ సందర్భంగా అయూబ్ పటేల్.. తాను దృష్టి లోపం సమస్యతో బాధపడుతున్నట్టుగా చెప్పారు. అయితే తన ముగ్గురు కుమార్తెలను చదివిస్తున్నానని.. వారి చదువులకు ప్రభుత్వం సహాయం చేస్తుందని ప్రధాని మోడీకి తెలిపారు. ఇద్దరు కూతుళ్లు ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లు పొందుతున్నారని చెప్పారు.12వ తరగతి చదువుతున్న కుమార్తెకు డాక్టర్ కావాలనే కోరిక ఉందన్నారు.
దీంతో మోదీ అయూబ్‌తో కలిసి అక్కడికి వచ్చిన అతడి కుమార్తె ఆలియాను.. ఏమి కావాలని కోరుకుంటున్నారని మోదీ అడిగారు. అప్పుడు ఆమె డాక్టర్ కావాలని అనుకుంటున్నట్టుగా చెప్పి ఉద్వేగానికి లోనయ్యారు. తన తండ్రి సమస్యను చూసిన తర్వాత డాక్టర్ కావాలని నిర్ణయించుకున్నట్టుగా పేర్కొన్నారు.
ఈ మాటలు విన్న మోదీ కొద్దిసేపు ఏం మాట్లాడకుండా.. భావోద్వేగానికి గురయ్యారు. ఆ తర్వాత స్పందిస్తూ.. ‘‘మీ కూతుళ్ల కలను నెరవేర్చడానికి మీకు ఏదైనా సహాయం కావాలంటే నాకు తెలియజేయండి’’ అని మోదీ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రధాని మోదీ స్పందించిన తీరుపై పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.