
మధ్యప్రదేశ్ లో ఘోరం జరిగింది. అన్నం తినేందుకు పలు మార్లు డబ్బులు అడిగాడని ఓ ఆరేళ్ల బాలుడిని హెడ్ కానిస్టేబుల్ చంపేశాడు. ఈ ఘటన దతియా జిల్లాలో జరిగింది. దీంతో ఆ పోలీసును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ విషయాన్ని ఎస్పీ అమన్ సింగ్ రాథోడ్ తెలిపారు.
ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. గ్వాలియర్ పోలీస్ ట్రైనింగ్ స్కూల్లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రవిశర్మ వద్దకు ఆరేళ్లు ఉన్న బాలుడు వచ్చాడు. తనకు ఆకలేస్తుందని, ఆహారం కొనేందుకు డబ్బులు ఇవ్వాలని అడిగాడు. దీనికి పోలీసు కానిస్టేబుల్ నిరాకరించాడు. అయినా కూడా బాలుడు అతడిని పదే పదే ప్రదేయపడ్డాడు. దీంతో అతడికి కోపం వచ్చి బాలుడిని తరిమి కొట్టాడు. కానీ ఆ కుర్రాడు మళ్ళీ వచ్చి డబ్బు అడిగాడు. దీంతో కోపంతో ఊగిపోయిన కానిస్టేబుల్ రవి శర్మ మైనర్ ను గొంతు నులిమి చంపేశాడు.
అయితే ఈ ఘటన విషయంలో కానిస్టేబుల్ రవిశర్మ స్పందించాడు. తాను కొంతకాలంగా డిప్రెషన్ తో బాధపడుతున్నానని చెప్పాడు. ఈ సమయంలో బాలుడు వచ్చి తనను డబ్బులు డిమాండ్ చేయడంతో పడ్డానని చెప్పాడు. ఆ సమయంలో క్షణికావేశంలో అలా ప్రవర్తించానని నిందితుడు పోలీసులకు వెల్లడించారు. కాగా నిందితుడిని పోలీసును సర్వీసు నుంచి తొలగించాలని కోరుతూ దతియా పోలీసు సూపరింటెండెంట్ రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయానికి లేఖ రాశారు.
మృతి చెందిన బాలుడు ఒక సెలూన్ యజమాని కుమారుడు. ఆ బాలుడు కనిపించడం లేదని అతడి కుటుంబం 5వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అదే రోజు గ్వాలియర్ జిల్లాలోని ఝాన్సీ రోడ్డు ప్రాంతంలో ఓ బాలుడి మృతదేహం లభ్యమైంది. స్థానిక పోలీసులు మృతదేహాన్ని బాలుడి చిత్రంతో సరిపోల్చినప్పుడు, మృతదేహం అదే మైనర్ అని నిర్ధారించారు అని పోలీసులు తెలిపారు. బాలుడి మృతదేహాన్ని గ్వాలియర్లోని ఝాన్సీ రోడ్ ప్రాంతంలో నల్ల వెర్నా కారు నుంచి పడేశారని దర్యాప్తులో తేలింది. ఈ కారు పోలీసు హెడ్ కానిస్టేబుల్ రవి శర్మకు చెందినదని పోలీసులు తేల్చారు.