
న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో తొలివందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని మోదీ ఈరోజు ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అజ్మీర్-ఢిల్లీ కంటోన్మెంట్ మధ్య ఈ రైలు పరుగులు తీయనుంది. ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రసంగించిన మోదీ.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ‘‘ఇండియా ఫస్ట్, ఆల్వేస్ ఫస్ట్’’ స్ఫూర్తిని సుసంపన్నం చేస్తుందని అన్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ భారతదేశంలో తయారైన మొదటి సెమీ హైస్పీడ్ రైలని గుర్తుచేశారు. ఇది అత్యంత కాంపాక్ట్, సమర్థవంతమైన రైళ్లలో ఒకటని చెప్పారు.
‘‘ఇది అభివృద్ధి, ఆధునికత, స్వావలంబన, స్థిరత్వానికి పర్యాయపదంగా మారింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రాజస్థాన్ పర్యాటక పరిశ్రమకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది’’ అని మోదీ పేర్కొన్నారు. గత రెండు నెలల్లో ఆరోవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించడం అదృష్టమని చెప్పారు. గతంలో స్వార్థ, నీచ రాజకీయాలు రైల్వేల ఆధునీకరణను కప్పివేసాయని ప్రధాని మోదీ ఆరోపించారు.
గతంలో పెద్ద ఎత్తున అవినీతి జరగడంతో రైల్వేలలో అభివృద్ధి జరగనివ్వలేదని, ఉద్యోగ ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరగనివ్వలేదని ప్రధాని మోదీ విమర్శించారు. ఇక, ఈ కొత్త వందే భారత్ రైలు రెగ్యులర్ సర్వీస్ ఏప్రిల్ 13 నుండి ప్రారంభమవుతుంది. జైపూర్, అల్వార్, గురుగ్రామ్‌లలో స్టాప్‌లతో అజ్మీర్- ఢిల్లీ కంటోన్మెంట్ మధ్య నడుస్తుంది. .ఈ రైలు పుష్కర్, అజ్మీర్ దర్గాలతో సహా రాజస్థాన్‌లోని ప్రధాన పర్యాటక ప్రాంతాలకు కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని రైల్వే అధికారులు చెప్పారు. ఇక, ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం సందర్భంగా జైపూర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజస్థాన్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు.