
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఒడిశాలో రూ. 8,200 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అలాగే ఒడిశా మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును కూడా జెండా ఊపి ప్రారంభించారు. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఒడిశాలోని పూరీ- పశ్చిమ బెంగాల్‌లోని హౌరా మధ్య పరుగులు పెట్టనుంది. ఈ కార్యక్రమంలో మోదీ వీడియో కాన్పరెన్స్ ద్వారా పాల్గొన్నారు. పూరీ స్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ.. నవ భారతదేశం తన సొంత సాంకేతిక పరిజ్ఞానాన్ని నిర్మిస్తోందని, వాటిని దేశంలోని వివిధ మూలలకు చేరుస్తోందని అన్నారు.
‘‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. హౌరా, పూరీల మధ్య మత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది’’ అని ప్రధాని మోదీ అన్నారు. ప్రస్తుతం దేశంలో పదిహేను వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని.. అవి కనెక్టివిటీ, ఆర్థిక వ్యవస్థ రెండింటినీ పెంచుతున్నాయని చెప్పారు. ‘‘ఒకప్పుడు కొత్త టెక్నాలజీలు, సౌకర్యాలు ఢిల్లీ లేదా పెద్ద నగరాలకే పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు, భారతదేశం కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఈ న్యూ ఇండియా తనంతట తానుగా సాంకేతికతలను తయారు చేసుకుంటోంది. దేశంలోని వివిధ మూలలకు చేరుకుంటుంది’’ అని మోదీ వందే భారత్ రైలును ఉద్దేశించి చెప్పారు.
దేశం స్వాతంత్య్రానికి సంబందించిన ‘‘అమృత్ కాల్’’ జరుపుకుంటున్న తరుణంలో.. దేశ ఐక్యతను మరింత పటిష్టం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశ ఐక్యత ఎంత బలపడితే.. దేశ సమిష్టి సామర్థ్యం అంతగా పెరుగుతుందని చెప్పారు. ‘‘అత్యంత సవాళ్ల మధ్య కూడా భారతదేశం తన అభివృద్ధి ప్రయాణాన్ని చెక్కుచెదరకుండా ఉంచింది. దీని వెనుక అన్ని రాష్ట్రాల భాగస్వామ్యం, సమిష్టిగా ముందుకు సాగాలనే భారతదేశ స్ఫూర్తి ఉంది’’ అని మోదీ అన్నారు.
ఇక, పూరీ, కటక్ రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి మోదీ శంకుస్థాపన చేశారు. ఒడిశాలోని రైల్వే నెట్‌వర్క్‌కు 100 శాతం విద్యుద్దీకరణను మోదీ జాతికి అంకితం చేశారు. దీంతో నిర్వహణ, నిర్వహణ వ్యయం తగ్గుతుందని.. దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటం తగ్గుతుందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. పూరీ-హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఈ మార్గంలో అత్యంత వేగవంతమైన రైలు అని.. దాదాపు ఆరున్నర గంటల్లో 500 కి.మీ దూరాన్ని చేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు. మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో రెండోది అయిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభిస్తున్నందుకు గుర్తుగా హౌరా స్టేషన్‌లో సాంస్కృతిక కార్యక్రమం కూడా నిర్వహించబడింది.
22895/22896 హౌరా-పూరీ-హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రెగ్యులర్‌గా మే 20 నుంచి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. గురువారం మినహా వారంలో ఆరు రోజులు నడిచే ఈ రైలు హౌరాలో ఉదయం 6.10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.35 గంటలకు పూరీకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో పూరీలో మధ్యాహ్నం 1.50 గంటలకు బయలుదేరి రాత్రి 8.30 గంటలకు హౌరా చేరుకుంటుందని వారు తెలిపారు. 16 కోచ్‌లతో కూడిన ఈ రైలు ఖరగ్‌పూర్, బాలాసోర్, భద్రక్, జాజ్‌పూర్ కియోంజర్ రోడ్, కటక్, భువనేశ్వర్, ఖుర్దా రోడ్‌లలో ఆగుతుంది.