
న్యూఢిల్లీ: కొత్తగా ఉద్యోగాలు పొందిన 71 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారంనాడు అందించారు. 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని మోడీ సర్కార్ హామీ ఇచ్చింది. ఈ హామీ అమల్లో భాగంగా ఇవాళ 71 వేల మందికి మోడీ అపాయింట్ మెంట్ లేఖలు అందించారు.
కొత్తగా ఉద్యోగాలు పొందిన వారితో ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రసంగించారు. దేశంలో 40 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా స్టార్టప్ ల ద్వారా ఉద్యోగాలు దక్కాయన్నారు. ప్రపంచంలో ఇండియా ఆర్ధిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ది చెందుతుందని మోడీ చెప్పారు. గత ఎనిమిదేళ్లలో దేశంలోని క్రీడా రంగం పునర్వైభవం సాధించిందన్నారు.
దేశంలోనే హైస్పీడ్ రైళ్లతో పాటు ఉపగ్రహలను తయారు చేస్తున్న విషయాన్ని మోడీ గుర్తు చేశారు.2014 ముందు రైల్వే లైన్ విద్యుద్దీకరణకు ఏదు దశాబ్దాలు పట్టిందన్నారు. 2014 తర్వాత 9 ఏళ్లలో 40 వేలకు పైగా రైల్వే లైన్ ను విద్యుద్ధీకరించినట్టుగా చెప్పారు.రక్షణ రంగానికి అవసరమైన కీలకమైన పరికరాలను కూడా దేశంలోనే తయారు చేస్తున్న విషయాన్ని మోడీ గుర్తు చేశారు.