
బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) ఇండియాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. విదేశీ మారకద్రవ్య ఉల్లంఘన ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. విదేశీ నిధుల కేసులో బీబీసీ ఇండియాపై ఈడీ ఈ చర్యలు తీసుకుంది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్, 1999 (FEMA) కింద బీబీసీ ఇండియాపై కేసు నమోదు చేసింది. ఫెమా నిబంధనల ప్రకారం.. కొంతమంది బీబీసీ అధికారుల నుంచి పత్రాలు, స్టేట్‌మెంట్‌ల రికార్డింగ్‌ను కూడా ఈడీ కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో బీబీసీపై ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఢిల్లీ, ముంబైలలోని బీబీసీ కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే అవి సోదాలు కాదని.. సర్వే అని ఐటీ అధికారులు తెలిపారు. ఆ తర్వాత క్రమంలోనే తాజాగా ఫెమా యాక్ట్ కింద బీబీసీ ఇండియాపై ఈడీ కేసు నమోదు చేసింది. ఎఫ్‌డిఐ ఉల్లంఘనలపై బీబీసీ ఇండియాపై దర్యాప్తు జరిగే అవకాశం కనిపిస్తుంది.
ఇక, గుజరాత్ అల్లర్లకు సంబంధించి ‘‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’’ పేరుతో బీబీసీ రెండు భాగాలతో కూడిన డాక్యూమెంటరీని యూకేలో ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన కొన్ని వారాలనే బీబీసీపై ఐటీ శాఖ సర్వే చేపట్టడాన్ని అప్పట్లో ప్రతిపక్షాలు ఖండించాయి. బీజేపీ టార్గెట్‌గా విమర్శలు గుప్పించాయి.