
న్యూఢిల్లీ: వచ్చే వేసవి ఎండలపై, రుతుపవనాలు, రబీ పంటపై వాటి ప్రభావం, వేసవి ఎండలతో ఏవైనా విపత్తులు సంభవిస్తే వాటిని ఎదుర్కోవడానికి మెడికల్ సదుపాయాలు సహా ఇతర అన్ని రకాల చర్యలను సిద్ధం చేసుకోవడంపై ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పౌరులు, ఇతరులకు ఈ పరిస్థితులపై అవగాహన కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు. రోజువారీగా వాతావరణ అంచనాలను ఐఎండీ అందరికీ సులువుగా అర్థమయ్యేలా రూపొందించాలని ప్రధాని అధికారులకు సూచనలు చేశారు. అలాగే, ఆస్పత్రుల్లో ఫైర్ ఆడిట్లు చేపట్టాలని, తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడానికి సరిపడా ధాన్యాన్ని నిల్వ చేసి సిద్ధంగా ఉంచాలని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ప్రధాని ఆదేశించారు.
ఢిల్లీలోని ప్రధాని నివాసంలో సోమవారం ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రానున్న నెలల్లో వాతావరణ అంచనాలను వాతావరణ శాఖ ప్రధానికి తెలియజేసింది. అలాగే, సాధారణంగా వచ్చే రుతుపవనాల గురించి వివరాలు అందించింది. రబీ పంటపై వాటి ప్రభావాలను అధికారులు తెలిపారు. సాగు నీటి సరఫరా, దానా, తాగు నీటిపై సమీక్షలు చేశారు. ఎమర్జెన్సీ కాలంలో అవసరమైన వైద్య సదుపాయాలనూ పరిశీలించారు. తీవ్ర ఎండలకు సంబంధించిన విపత్తులను ఎదుర్కోవడానికి సిద్ధం చేయాల్సిన వాటిని, తీసుకోవాల్సిన చర్యలను ఈ సమావేశంలో చర్చించినట్టు కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది.
Also Read: ట్రైన్ చివరి బోగీ వెనుకాల ‘X’ సింబల్ ఎందుకు ఉంటుందో తెలుసా? రైల్వే శాఖ వివరణ ఇదే
ఈ వివరాలను, ఎండా కాలంలో పాటించా ల్సిన అంశాలను పౌరులు, మెడికల్ ప్రొఫెషనల్స్, మున్సిపల్, పంచాయతీ అధికారులు, డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ వంటివారందరికీ అందుబాటులో ఉంచాలని ప్రధాని సూచించారు. కొన్ని మల్టీ మీడియా లెక్చర్ సెషన్ల ద్వారా స్కూల్ పిల్లలకు అవగాహన కల్పించాలని వివరించారు.
అలాగే, రోజువారీ వాతావరణ అంశాలు అందరికీ సులువుగా అర్థమయ్యేలా రూపొందించాలని ఐఎండీని ఆదేశించారు. అన్ని హాస్పిటళ్లలో ఫైర్ ఆడిట్లు చేపట్టాలని, ఫైర్ డ్రిల్స్ చేపట్టాలని ఆదేశించారు. అడవిలో కార్చిచ్చు రేగినా వాటిని ఎదుర్కో వడానికి సంబంధించి చర్చించారు.
పశువులకు అందుబాటులో ఉండే దాణా, రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఎప్పటి కప్పుడు ట్రాక్ చేయాలని ప్రధాని ఆదేశించారు. తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో పౌరులకు ధాన్యం అందించడానికి సరపడా నిల్వలు పాటించాలని ఎఫ్‌సీఐని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రధానికి ప్రిన్సిపల్ సెక్రెటరీ, క్యాబినెట్ సెక్రెటరీ, హోం సెక్రెటరీ, సహా ఇతర శాఖల సెక్రెటరీలు పాల్గొన్నారు.