PM Modi : 'ది సక్సెస్ స్టోరీ ఆఫ్ ది చాయ్‌వాలా ప్రధాని'.. మోడీ రాజకీయ ప్రస్థానం.. అడుగడుగునా ఎన్నో మలుపులు..

By Rajesh Karampoori  |  First Published Sep 17, 2023, 9:50 AM IST

PM Modi birthday: ప్రధాని నరేంద్ర మోదీ నేడు 73వ ఏట అడుగుపెట్టనున్నారు. వాద్‌నగర్ రైల్వే స్టేషన్‌లో టీ అమ్మే వ్యక్తి నుంచి ప్రధాని అయ్యే వరకు సాగిన ప్రయాణం అంత సులభమేమి కాదు.  


PM Modi birthday: నేడు ప్రధాని నరేంద్ర మోదీ పేరు దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. దేశప్రజలతో పాటు విదేశాల్లో నివసించే వారిలో కూడా ప్రధాని మోదీకి మంచి ఆదరణ ఉంది. ఈ ఏడాది ప్రధాని మోదీ తన 73వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.. 

ప్రధాని మోదీ బాల్యం

Latest Videos

ప్రధాని మోదీ గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో సెప్టెంబర్ 17, 1950లో జన్మించారు. నరేంద్ర మోడీ పూర్తి పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. దామోదర్ దాస్ మోదీ, హీరా బెన్ దంపతులకు మోడీ మూడో సంతానం. ప్రధాని మోదీ ప్రాథమిక విద్యాభ్యాసం వాద్‌నగర్‌లోని భగవాచార్య నారాయణాచార్య పాఠశాలలో జరిగింది. చిన్నతనం నుండే మోడీ నటన, డిబేట్ పోటీలు, నాటకాల్లో చాలా చురుకుగా పాల్గొనేవారు. అందులో భాగంగా అతను అనేక అవార్డులను గెలుచుకున్నాడు. వాద్ నగర్ లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి దూర విద్య ద్వారా రాజనీతి శాస్త్రంలో డిగ్రీ, గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రంలో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. 

పాఠశాల విద్య సమయంలో నుండే మోదీ  ఆర్.ఎస్.ఎస్ లో చేరారు. 1958లో దీపావళి సందర్భంగా గుజరాత్ ప్రావిన్స్‌కు చెందిన బోధకుడు లక్ష్మణ్ రావు ఇనామ్‌దార్ బాల వాలంటీర్‌గా ప్రమాణం చేయించారు. దీని తర్వాత అతను క్రమంగా సంఘ్‌లో క్రియాశీల సభ్యునిగా మారాడు. తన తొలినాళ్లలో ప్రధాని మోదీకి స్కూటర్‌ తొక్కడం తెలియదు కాబట్టి ఆ సమయంలో బీజేపీ నేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శంకర్‌సింగ్‌ వాఘేలాతో కలిసి తిరిగేవారు. స్వయం సేవక్ గా శాఖలకు వెళ్ళేవాడు.  అతి కొద్ది కాలంలోనే కీలకమైన బాధ్యతలు చేపట్టాడు. ఒక మారుమూల గ్రామంలో చాయ్ అమ్మడం ద్వారా ప్రారంభమైన ఆయన జీవితం కాల క్రమంలో అనేక మలుపులు తిరిగింది.

వాద్‌నగర్ రైల్వే స్టేషన్‌లో ప్రధాని మోదీ తండ్రికి టీ స్టాల్ ఉండేది. మోదీ తన తండ్రికి సహాయం చేయడానికి వెళ్లేవారు. అందుకే నేటికీ ప్రజలు ఆయనను చాయ్‌వాలా ప్రధానిగా పిలుచుకుంటున్నారు. 1965 లో ఇండో-పాక్ యుద్ధం సమయంలో వాద్‌నగర్ రైల్వే స్టేషన్ గుండా వెళ్లే భారతీయ సైనికులకు టీ అందించాడు. ఆ సమయంలో తాను కూడా దేశానికి సేవ చేయడానికి భారత సైన్యంలో భాగమవుతానని నిర్ణయించుకున్నాడు.

 రాజకీయ ప్రయాణం

ప్రధాని నరేంద్ర మోడీ .. లాల్ కృష్ణ అద్వానీని తన రాజకీయ గురువుగా భావిస్తారు. 1985లో ప్రధాని మోదీ తొలిసారి రాజకీయాల్లోకి ప్రవేశించి బీజేపీలో చేరారు. ఆ తర్వాత పార్టీలో పెద్ద పెద్ద బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 1988-89లో ప్రధాని మోదీ గుజరాత్‌ బీజేపీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు స్వీకరించారు. 1995లో ప్రధాని మోదీ తన క్రియాశీలత, కృషికి బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమించబడ్డారు.

మోదీ ఆర్.ఎస్.ఎస్ లో క్రియా శీలకంగా వ్యవహరిస్తున్న సమయంలోనే ఆనాటి గుజరాత్ రాష్ట్ర జనసంఘ్ పార్టీ ముఖ్య నాయకులు నాథులాల్ ఝాగ్దా , వసంత్ భాయ్ గజేంద్రద్కర్ లతో ఏర్పడ్డ సన్నిహిత సంబంధాలు మోదీ ని రాజకీయాల పట్ల ఆకర్షితుడిని చేశాయి. 1986లో ఆర్.ఎస్.ఎస్ నుంచి బీజేపీలోకి ప్రవేశించిన మొదటి తరం నాయకుల్లో మోడీ ఒకరు. బీజేపీలో చేరిన తర్వాత మోడీ తొలిసారి అహ్మదాబాద్ పురపాలక సంఘ ఎన్నికల భాద్యతలు తీసుకున్నారు.

ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడంతో ఆయన కీలకంగా వ్యవహరించడంతో బీజేపీ అగ్రనాయకత్వం దృష్టిలో ఆయన పై పడింది. అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎల్.కె.అద్వానీ ప్రోత్సాహం తోడు కావడంతో అతి కొద్దికాలంలోనే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు. 1990లో లాల్ కృష్ణ అద్వానీ చేపట్టిన అయోధ్య రథయాత్రకు గుజరాత్ బాధ్యుడిగా.. 1992లో మరళీ మనోహర్ జోషి చేపట్టిన కన్యాకుమారి-కాశ్మీర్ ఏక్తా రథయాత్రకు జాతీయ ఇన్‌చార్జీగా పనిచేశారు.

అలాగే.. 1993లో బీజేపీ ని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పలు కార్యక్రమాలు చేపట్టారు. 1995లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కీలకమైన పాత్ర పోషించారు. ఈ విజయం తరువాత ఆయన సేవలను జాతీయ స్థాయిలో వాడుకునేందుకు ప్రధాని మోడీని హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఇంఛార్జి గా నియమించారు. ఆయా రాష్ట్రాల ఇంఛార్జి గా పార్టీని బలోపేతం చేయడమే కాకుండా పార్టీని అధికారంలోకి తీసుకరావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. మోదీ సాధించిన విజయాలను గమనించిన ఆర్.ఎస్.ఎస్ , బీజేపీ నాయకత్వం బీజేపీ జాతీయ కార్యదర్శి పదవిని కట్టబెట్టింది. 

1997లో అద్వానీ చేపట్టిన స్వర్ణజయన్త రథయాత్ర నిర్వహణ బాధ్యతను తీసుకొని విజయవంతం గా నిర్వహించి రథయాత్ర విజయానికి కీలకమైన పాత్ర పోషించాడు. 1998లో బీజేపీ పార్టీ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన కుష్బూ థాక్రే ప్రోద్బలంతో మోదీ భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు. ఆ తర్వాత జరిగిన 1998, 1999లలో లోక్ సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూనే 1998లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో తన వ్యూహాలతో పార్టీని విజయతీరాలకు చేర్చడంతో పార్టీలో సీనియర్ నాయకుడైన కేశూభాయి పటేల్ ముఖ్యమంత్రి అయ్యారు. 


 
2001లో ముఖ్యమంత్రిగా 

2001లో గుజరాత్‌లో సంభవించిన భారీ భూకంపం తర్వాత చాలా విధ్వంసం జరిగింది. నిర్లక్ష్యం కారణంగా అప్పటి సీఎం కేశూభాయ్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. దీని తరువాత నరేంద్ర మోడీని ఢిల్లీ నుండి గుజరాత్ పంపారు. మొదటిసారి ప్రధాని మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత రాష్ట్రంలో మోదీకి తిరుగులేదు. 2012 శాసనసభ ఎన్నికలలో విజయభేరి మ్రోగించి వరుసగా నాల్గవసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. 2012లోనే నరేంద్ర మోడీని ప్రధానిగా ప్రమోట్ చేయడం ప్రారంభించారు.

2014లో  ప్రధానిగా   

2013లో కర్ణాటక శాసనసభ ఎన్నికల అనంతరం భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం మోదీని ప్రధానమంత్రి పదవికి అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి అనుకూల పవనాలు బలంగా వీచాయి. మొదట్లో మోదీ రాజకీయ గురువు లాల్ కృష్ణ అద్వాని అడ్డు తగిలినప్పటికీ.. అనంతరం ఆయన కూడా మోదీ అభ్యర్థిత్వాన్ని అంగీకరించారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో ఎవరూ ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ గణనీయమైన స్థానాల్లో విజయం సాధించింది. మోదీ స్వయంగా వడోడర నుంచి 5 లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా వారణాసిలో కూడా భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇలా 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీని ప్రధానిగా ఎన్నికయ్యారు.

2014 ఎన్నికల్లో  భారతీయ జనతా పార్టీకి ఇంకో అరుదైన రికార్డు కూడా కైవసం చేసుకుంది. అదే మొదటిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం మెజారిటీ సాధించి.. అధికార పగ్గాలను చేపట్టింది. ఆ సమయంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో PM మోడీకి 282 సీట్లు వచ్చాయి. దీని తర్వాత 2019 లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా ప్రధాని మోదీ మరోసారి చరిత్ర సృష్టించి, ప్రధానిగా ప్రమాణం చేశారు. ఎర్రకోటపై నుంచి వరుసగా 9 సార్లు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన తొలి కాంగ్రెసేతర ప్రధాని మోదీ అరుదైన ఘనత సాధించారు. 2019 నుండి ఇప్పటి వరకు PM మోడీ తన గుర్తింపు, గౌరవం, పని పురోగతికి దేశ, విదేశాల నుండి నిరంతరం ప్రశంసలు అందుకుంటున్నారు. ఇది మాత్రమే కాదు.. ప్రవాస భారతీయులు కూడా ప్రధాని మోడీకి ఫిదా అవుతున్నారు.

అత్యున్నత పురస్కారాలు

>> ప్ర‌పంచంలోని పలు దేశాలు ఆ దేశాల అత్యున్నత పురస్కారాలను ప్ర‌ధాన మంత్రికి ఇచ్చి గౌరవించాయి.  

>> ఇటీవలి గ్రీస్ లో  పర్యటించిన ప్రధాని మోడీకి ఆ దేశం తమ రెండవ అత్యున్నత పౌర పురస్కారం 'ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ హానర్'ఇచ్చి గౌరవించింది. 

>> జూలై 2023లో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రాన్ తమ దేశం యొక్క అత్యున్నత పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్ ఇచ్చి గౌరవించారు. 

>>  2023, జూన్ లో ఈజిప్ట్ .. ఆర్డర్ ఆఫ్ ది నైలు పురస్కారంతో గౌరవించింది. 

>> 2023 మే లో పాపువా న్యూ గినియా..  కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లోగోహు అవార్డు ఇచ్చింది.

>> మేలో ఫిజీ తన దేశంలోని అత్యున్నత పురస్కారమైన కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ అవార్డు ఇచ్చి గౌరవించింది. 

>> 2019లో మాల్దీవులు ప్రధాని మోదీకి ఆర్డర్ ఆఫ్ ది డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజ్జుద్దీన్ ఇచ్చి సత్కారించింది. 

>> 2019లో పీఎం నరేంద్ర మోదీకి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ఆఫ్ రష్యా అవార్డు లభించింది.

>> 2019లో ప్రధానమంత్రిని UAE ఆర్డర్ ఆఫ్ జాయెద్ అవార్డుతో సత్కరించింది.

>> 2018లో 'గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా' అవార్డు కూడా వరించింది. 

click me!