
న్యూఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం నమోదు చేసింది. బీజేపీ శతవిధాల ప్రయత్నించినా విజయం సాధించలేకపోయింది. కేంద్ర మంత్రులు, బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా పదుల సంఖ్యలో ర్యాలీలు, రోడ్ షోల్లో పాల్గొని ప్రసంగాలు ఇచ్చారు. కానీ, బీజేపీ అనుకున్న ఫలితాలను సాధించలేక 60ల్లోనే చతికిలపడిపోయింది. కాగా, కాంగ్రెస్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో ఎమ్మెల్యేలను గెలుచుకుంది.
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ.. బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిందని, ప్రధాని మోడీ ఓడిపోయాడని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. బీజేపీ ఈ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని మోడీకి రిఫరెండెమ్‌గా మార్చిందని వివరించారు. ప్రధాని ఆశీర్వాదం పొందాలనే నెరేటివ్‌ను కూడా ముందుకు తెచ్చారని తెలిపారు. కానీ, కర్ణాటక ప్రజలు వారిని స్పష్టంగా తిరస్కరించారని వివరించారు.
కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను స్థానిక అంశాలపై పోరాడిందని జైరాం రమేశ్ పేర్కొన్నారు. ఉపాధి, ఆహార భద్రత, ధరల పెరుగుదల, రైతుల సమస్యలు, విద్యుత్ పంపిణీ, నిరుద్యోగం, అవినీతి అంశాలపై పోరాడిందని తెలిపారు.
ప్రధాని మోడీ విభజన, వేర్పాటు ప్రయత్నాలను ఎక్కించారని ఆరోపించారు. కర్ణాటక ఓటింగ్ బెంగళూరు ఇంజిన్ అని, ఈ ఇంజిన్ ఆర్థిక వృద్ధితో సమాజ సామరస్యతతో కలుస్తుందని వివరించారు.