
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా తీర్పే అంతిమమైనదని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జేడీఎస్‌కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ 20 స్థానాలకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కర్ణాటక ఎన్నిలక ఫలితాలపై స్పందించిన కుమారస్వామి.. ఓటమిని, గెలుపును సమదృష్టితో స్వీకరిస్తానని చెప్పారు. అయితే ఈ ఓటమి ఫైనల్ కాదని.. తన పోరాటం ఆగదని అన్నారు. ఎప్పుడూ ప్రజలతోనే ఉంటానని చెప్పారు. తమ పార్టీకి ఓట్లు వేసిన ప్రజలకు అభినందనలు తెలిపారు.
ఓటమి, గెలుపు.. తనకు, తన కుటుంబానికి కొత్త కాదని అన్నారు. గతంలో హెచ్‌డి దేవెగౌడ, హెచ్‌డీ రేవణ్ణ, తాను కూడా ఓడిపోయామని అన్నారు. అయితే తాము గెలిచాక నిబద్ధతతో ప్రజలకు సేవ చేశామని చెప్పారు. రానున్న రోజుల్లో పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి రానున్న కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్టుగా తెలిపారు.
ఈ ఎన్నికల్లో పార్టీ తరపున అహోరాత్రులు కృషి చేసిన కార్యకర్తలు, నాయకులు, అభ్యర్థులకు తన కృతజ్ఞతలు తెలిపారు. ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. తాను వారి వెంట ఉంటానని చెప్పారు.