
దోషులుగా తేలిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఆటోమేటిక్ అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్‌లో ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8(3) చెల్లుబాటును సవాలు చేశారు. కేరళకు చెందిన పీహెచ్‌డీ స్కాలర్ ఆభా మురళీధరన్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆటోమేటిక్ అనర్హత అనేది రాజ్యాంగ విరుద్దమని పిటిషన్‌లో ప్రస్తావించారు. అనర్హత పేరుతో పార్టీల రాజకీయ ఎజెండాలను ఆర్‌పీఏ 1951లోని సెక్షన్ 8(3) ప్రోత్సహిస్తుందని అన్నారు.
ఆటోమేటిక్ అనర్హత సభ్యులను వారి సంబంధిత నియోజకవర్గ ఓటర్లు వారిపై విధించిన విధులను స్వేచ్ఛగా నిర్వర్తించకుండా నిరోధిస్తుందని.. ఇది ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం అని పిటిషన్‌లో పేర్కొన్నారు. సహజ న్యాయసూత్రాలకు విరుద్దమైన ఆటోమేటిక్ అనర్హతపై తగిన ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. లిల్లీ థామస్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ కేసులో ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8(4)ని 2013లో కొట్టివేసింది.
ఇక, ఈ పిటిషన్ సుప్రీం కోర్టులో వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిన సమయంలో.. ఈ పిటిషన్ దాఖలు కావడం గమనార్హం.