
న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రభుత్వాలకు ఆకర్షక నిర్ణయాలు తీసుకోవడం కద్దు. ఈ సారి కూడా అలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయని అనుకోవడం సహజమే. ఇందులో భాగంగానే పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా తగ్గిస్తారేమో అనే చర్చ మొదలైంది. మూడు నాలుగు ఏళ్లకు పూర్వం పెట్రోల్ రేట్లు లీటర్‌కు రూ. 80లకు చేరితేనే తీవ్ర వ్యతిరేకత వచ్చేది. కానీ, ఇప్పుడు సెంచరీ దాటి సెటిల్ అయింది. అయితే.. ఇప్పుడు ఎన్నికలు వస్తుండటంతో మరోసారి పెట్రోల్ రేట్లు తగ్గుతాయేమో అనే చర్చ మొదలైంది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి ముందు ప్రస్తావించగా.. ఆయన స్పష్టమైన సమాధానం ఇచ్చారు.
ఇంధన ధరలను తగ్గిస్తారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. ఇంధన ధరలు తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు అన్నీ తీసుకుంటున్నదని వివరించారు. అయితే.. అంతర్జాతీయ మార్కెటలో ముడి చమురు ధరలు పెరగడంతో దేశీయంగా పెట్రో ధరలు తగ్గించడం సాధ్యం కావడం లేదని చెప్పారు.
చమురు ధరలను నిర్ణయించడంలో చాలా అంశాల ప్రమేయం ఉంటుందని కేంద్రమంత్రి అన్నారు. రవాణా ఖర్చులు, రిఫైనింగ్ ఖర్చులు, అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు, పన్నులు.. ఇలా పలు అంశాలు పెట్రోల్, డీజిల్ రేట్లను నిర్ణయించడంలో కీలకంగా ఉంటాయని తెలిపారు.
Also Read: మిషన్ అమృత్ సరోవర్‌లో తెలంగాణ వెనుకబడింది: కేంద్రం
మహమ్మారి తర్వాత చమురు ధరలు విపరీతంగా పెరిగాయని, అయినా.. దేశీయంగా ఆ ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకున్నామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. పెరిగిన ధరలను తగ్గించాలని చమురు సరఫరా చేస్తున్న దేశాలను కోరడానికి బదులు ఎక్సైజ్ పన్ను తగ్గించి వినియోగదారులకు ఉపశమనం కల్పించామని వివరించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంధనం పై వ్యాట్ తగ్గించామని పేర్కొన్నారు. ఆ తర్వాత, చమురు ధరలు రూ. 8, రూ.11 వరకు తగ్గిపోయాయని వివరించారు.