
యోగా ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యం పొందాలని ఆకాంక్షించారు ప్రధాని నరేంద్ర మోడీ. శరీరం, మనస్సును ఆరోగ్యంగా వుంచడటంతో పాటు సంతోషంగా ఉండటానికి యోగా ప్రపంచాన్ని కలుపుతుందని ప్రధాని శుక్రవారం అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే వారం తన అమెరికా పర్యటన సందర్భంగా.. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు మోడీ నాయకత్వం వహిస్తారు.
కాగా.. ఐక్యరాజ్యసమితిలో జరిగే యోగా డే వేడుకల్లో 180కి పైగా దేశాలకు చెందిన ప్రజలు, వివిధ రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న దౌత్యవేత్తలు, కళాకారులు, విద్యావేత్తలు , పారిశ్రామికవేత్తలు పాల్గొంటారని శనివారం సంబంధిత వర్గాలు తెలియజేశాయి. 2014లో ప్రధాని మోడీ పదవీకాలం మొదటి సంవత్సరంలో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించడం.. మోడీ సాధించిన విజయాల జాబితాల హైలైట్‌గా నిపుణులు అభివర్ణిస్తారు.
కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో విజయోత్సవాలు జరుపుకుంటున్న ఆ పార్టీ శ్రేణులు యోగా డే గురించి కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జూన్ 21న జరిగే ఈ ఈవెంట్‌ను విజయవంతం చేయడానికి భారత ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. ఐరాస ప్రధాన కార్యాలయంలోని నార్త్ లాన్‌లో ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్య జరిగే 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు మోడీ నాయకత్వం వహిస్తారు.
2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే .. ఆ ఏడాది సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తన తొలి ప్రసంగంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పాటించాలని పిలుపునచ్చారు మోడీ. యోగా మానవాళికి భారతదేశం ఇచ్చిన అమూల్యమైన బహుమతి అని ఆయన అన్నారు. యోగా మనస్సు, శరీరాన్ని ఐక్యంగా వుంచుతుందని.. మనిషి-ప్రకృతి మధ్య సంధానకర్తగా వుంటుందని మోడీ చెప్పారు. ఐరాసలో నరేంద్ర మోడీ చేసిన విజ్ఞప్తికి విస్తృత మద్ధతు లభించింది.
Also Read: యోగా విశ్వవ్యాప్తమవుతోందన్న మోడీ .. ఆసనాలు పంచుకున్న ప్రధాని, వీడియో వైరల్
డిసెంబర్ 2014లో భారతదేశం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని గ్లోబల్ ఫోరమ్‌లో రికార్డు స్థాయిలో 175 సభ్యదేశాలు ఆమోదించాయి. మంచి ఆరోగ్యాన్ని పెంపొందించే జీవనశైలి విధానాలను అనుసరించే ప్రాముఖ్యతను ఈ తీర్మానం హైలైట్ చేసింది. నాటి నుంచి యోగా డే నాడు ప్రధాని మోడీతో పాటు బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సామూహిక యోగా కార్యక్రమాలకు హాజరవుతున్నారు. భారత్‌తో పాటు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాల్లోనూ ప్రవాస భారతీయులు, విదేశీయులు అంతర్జాతీయ యోగా డే కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు.
ఇకపోతే.. మోడీ అమెరికా పర్యటన న్యూయార్క్‌లో ప్రారంభమవుతుంది. జూన్ 21న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు మోడీ నాయకత్వం వహిస్తారు. వైట్‌హౌస్‌లో ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్‌లు మోడీకి ఆతిథ్యం ఇవ్వనున్నారు. అలాగే యూఎస్ కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు. తద్వారా ఘనత సాధించిన తొలి భారత ప్రధానిగా ఆయన రికార్డుల్లోకెక్కనున్నారు. దీనితో పాటు వాషింగ్టన్‌లో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనూ ప్రధాని పాల్గొంటారు.