
న్యూఢిల్లీ: ఆదిపురుష్ సినిమాపై ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ విమర్శలు గుప్పించారు. ఆదిపురుష్ సినిమాలోని సంభాషణలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని ఆరోపించారు. చౌకబారు డైలాగ్‌లు హిందువుల మనోభావాలను గాయపరిచాయని అన్నారు. శ్రీరాముడు, హనుమాన్, సీతా దేవీలను వారికి నచ్చినట్టుగా ఊహించుకుని ఇష్టారీతిన ఎలా చిత్రిస్తారు? అని ప్రశ్నించారు. ఇలాంటి చౌకబారు సినిమాను బీజేపీ నేతలు సమర్థించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
తాను ఎంతో ఆవేదనతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినట్టు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. రాముడి పేరు చెబితో భక్తితో భారత ప్రజలు తల దించుకుంటారని, అలాంటి రాముడిని, హనుమంతుడిని, సీతా దేవిని అవమానకరంగా ఈ సినిమాలో చూపించారని ఆరోపించారు. దేశమంతటా ఈ అవమానపూరిత సినిమాను ప్రదర్శిస్తున్నారని వివరించారు.
Also Read: ‘ఆపరేషన్ గంగ’.. తిరుగులేని భారత ఆత్మవిశ్వాసానికి తార్కాణం: ఆ డాక్యుమెంటరీపై ప్రధాని మోడీ ట్వీట్
బీజేపీ నేతలే ఈ సినిమాను తీయించారని ఆరోపించారు. హిందూ దేవుళ్లను అవమానించే సినిమాను వారు తీయించారని తెలిపారు. తాను బీజేపీ నేతలను ఎందుకు అంటున్నానంటే.. స్వయంగా సినిమా యూనిట్ వారి పేర్లను పేర్కొందని వివరించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే సహా పలువురు బీజేపీ నేతల ఆశీర్వాదం ఉన్నట్టు పేర్కొన్నారని తెలిపారు. వీరంతా కలిసి రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమాలో చౌకబారు మాటలను చేర్చారని ఆరోపించారు.