పెగాసెస్‌పై మమత సంచలనం: రిటైర్డ్ జడ్జిలతో విచారణ కమిటీ

By narsimha lodeFirst Published Jul 26, 2021, 5:00 PM IST
Highlights

పెగాసెస్ పై విచారణకు  బెంగాల్ సీఎం మమత బెనర్జీ  ఇద్దరు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఇద్దరు రిటైర్డ్ జడ్జిలతో కమిటీ ఏర్పాటు చేసింది మమత సర్కార్. నాలుగు వారాల్లో  నివేదికను అందించాలని కమిటీని ఆదేశించింది బెంగాల్ ప్రభుత్వం.

న్యూఢిల్లీ: పెగాసెస్ సాఫ్ట్ వేర్ ద్వారా ఫోన్ హ్యాకింగ్ జరిగిందనే ప్రచారంపై పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ కీలక నిర్ణయం తీసుకొన్నారు. ఈ ఫోన్ల హ్యాకింగ్ వ్యవహరంపై విచారణకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి మదన్ లోకో నేతృత్వంలో ద్విసభ్యకమిటీనీ  నియమించింది. ఈ మేరకు సోమవారం నాడు బెంగాల్ సర్కార్  ఈ సంచలన నిర్ణయం తీసుకొంది.

 ప్రతిపక్ష నేతలు, రాజకీయ నేతలు, జర్నలిస్టులు, హక్కుల సంఘ నేతలకు చెందిన వందలాది ఫోన్‌లను హ్యాకింగ్‌  చేశారని మీడియాలో కథనాలు వచ్చాయి.ఈ విషయమై చర్చించాలని పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాలు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.ఈ విషయమై విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తోందని భావించినా దీనిపై కేంద్రం నోరు మెదపని కారణంగానే  తానే విచారణ కమిషన్ ఏర్పాటు చేసినట్టుగా మమత బెనర్జీ ప్రకటించారు.

 కోల్‌కతా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ జ్యోతిర్మయి భట్టాచార్య, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ భీమ్‌రావ్ లోకూర్‌తో కూడిన ప్యానెల్ నాలుగు వారాల్లో  నివేదిక సమర్పించనుంది. ఇజ్రాయెల్ ఎన్‌ఎస్‌ఓ గ్రూప్  పెగాసస్‌ హ్యాకింగ్‌ జాబితాలో ఆమె మేనల్లుడు, తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ పేరు కూడా ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే. 
 

click me!