
Pegasus spyware: గతేడాది దేశంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం మళ్లీ తెరమీదకు వచ్చింది. మంగళవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటం, ఫిబ్రవరిలోనే కీలకమైన ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దేశంలో మరోసారి పెగసస్ స్పైవేర్ (Pegasus spyware) ప్రకంపనలు సృష్టిస్తోంది. పెగాసస్ తో తాము ఎవరీ మీద నిఘా పెట్టలేదనీ, దానిని కొనుగోలు చేయలేదని ఇదివరకే ప్రభుత్వం పేర్కొంది. దేశంలోని ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, సమాజిక కార్యకర్తలు కోర్టును ఆశ్రయించడంతో దీనిపై సుప్రీంకోర్టు కమిటీ దర్యాప్తు చేస్తోంది. అయితే, ఇజ్రాయిల్‌తో కుదిరిన రక్షణ ఒప్పందంలో భాగంగా పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను భారత్ కొనుగోలు చేసిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక సంచలన కథనం రాసుకొచ్చింది. ఈ నేపథ్యంలో మళ్లీ దేశంలో పెగాసస్ స్పై వేర్ వ్యవహారం రాజకీయ రచ్చ చేస్తోంది. ప్రతిపక్షాలు ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ సర్కారును టార్గెట్ చేస్తూ.. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. మరోసారి న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనంతో సుప్రీంకోర్టు (Supreme Court) లో మరో పిటిషన్ దాఖలు అయింది.
దేశాన్ని కుదిపేసిన పెగాసస్ స్పైవేర్ (Pegasus spyware)పై సుప్రీంకోర్టులో తాజాగా మరో పిటిషన్ దాఖలైంది. ఎన్ఎస్‌వో గ్రూప్ తయారుచేసిన పెగాసస్ స్పైవేర్ కు సంబంధించి భారత్ -ఇజ్రాయెల్ మధ్య జరిగిన ఒప్పందంపై దర్యాప్తు చేయాలని ప్రముఖ న్యాయవాది ఎంఎల్ శర్మ సుప్రీంకోర్టు (Supreme Court) లో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఒప్పందంలో పాల్గొన్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలనీ, దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ఎంఎల్ శర్మ తన పిటిషన్ లో పేర్కొన్నారు. పిటిషన్‌కు పెగాసస్‌పై న్యూయార్క్ టైమ్స్ (New York Times) ఇటీవల ప్రచురించిన సంచలన కథనం వివరాలను సైతం ఆయన జోడించారు. భారత ప్రభుత్వం స్పైవేర్ ను కోనుగోలు చేసిందా? పార్లమెంటేరియన్లు, జర్నలిస్టులు, కార్యకర్తలు, కోర్టు సిబ్బంది, మంత్రులు సహా దేశ పౌరులపై నిఘా పెట్టడానికి స్పైవేర్ ను ప్రభుత్వం ఉపయోగించిందా? అనే విషయాలపై దర్యాప్తు చేయాలని కోరుతూ గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన పిటిషనర్లలో న్యాయవాది ఎంఎల్ శర్మ ఒకరు. గతంలో దాఖలైన పిటిషన్ల నేపథ్యంలో సుప్రీంకోర్టు (Supreme Court) పెగాసస్ స్పైవేర్ తో నిఘా పెట్టారనే వాటిపై దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
న్యూయార్క్ టైమ్స్ కథనంతో మరోసారి సెగాసస్ స్పైవేర్ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే బీజేపీపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇజ్రాయెల్‌తో ఒప్పందంలో భాగంగా 2017లో పెగాసస్ స్పైవేర్ (Israeli spyware Pegasus)ను మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు కొనుగోలు చేసిందనీ, మోడీ సర్కారు దేశద్రోహానికి పాల్పడిందంటూ ఘాటు వ్యాఖ్యాలు చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మన ప్రజాస్వామ్యం, నాయకులు, ప్రజలు, సంస్థలపై నిఘా పెట్టడానికి పెగాసస్‌ను కొనుగోలు చేసిందని ఆరోపించారు. అక్రమ రీతిలో దేశ పౌరులపై నిఘా పెట్టడం ముమ్మాటికి దేశ ద్రోహమేనని రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు.