Patna serial blasts: మోదీ ర్యాలీ వద్ద పేలుళ్ల కేసు.. నలుగురు దోషులకు ఉరి శిక్ష.. ఎన్‌ఐఏ కోర్టు సంచలన తీర్పు

By team teluguFirst Published Nov 1, 2021, 4:48 PM IST
Highlights

2013 పాట్నా వరుస పేలుళ్ల (Patna serial blasts) కేసులో ఎన్‌ఐఏ కోర్టు సంచలన  తీర్పు వెలువరించింది. మొత్తం 9 మందిని దోషులుగా నిర్దారించిన కోర్టు.. వారిలో నలుగురికి ఉరి శిక్ష విధించింది.

2013 పాట్నా వరుస పేలుళ్ల (Patna serial blasts) కేసులో ఎన్‌ఐఏ కోర్టు సంచలన  తీర్పు  వెలువరించింది. ఈ కేసుకు సంబంధించి అక్టోబర్  27న 10 మంది నిందితుల్లో 9 మందిని ఎన్‌ఐఏ కోర్టు దోషులుగా నిర్దారించింది. సరైన ఆధారాలు లేకపోవడంతో ఒక నిందితుడిని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. తాజాగా ఈ కేసులో దోషులకు శిక్షలు ఖరారు చేసింది. నలుగురు దోషులకు ఉరి శిక్ష  విధించిన  కోర్టు.. ఇద్దరికి  జీవిత ఖైదు విధించింది. మరో ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇంకో దోషికి.. ఏడేళ్ల  జైలు శిక్షను  విధిస్తూ తీర్పును వెలువరించింది. 

2013లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోదీ.. అక్టోబర్ 27వ తేదీన పాట్నాలోని గాంధీ మైదాన్‌లో హుంకార్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ ప్రారంభానికి ముందే ఆ ప్రాంతం బాంబు పేలుళ్ల‌తో ద‌ద్ధ‌రిల్లింది. ఈ పేలుళ్లలో ఆరుగురు మృతిచెందారు. 90 మందికి పైగా గాయపడ్డారు. ర్యాలీ వేదిక చుట్టూ ఆరు పేలుళ్లు జరగగా.. ప్రధాన వేదిక నుంచి 150 మీటర్ల దూరంలోనే రెండు బాంబులు పేలాయి. Narendra Modi, బీజేపీ అగ్రనేతలు వేదికపైకి రావడానికి 20 నిమిషాల ముందు చివరి బాంబు పేలింది. అప్పుడు సమయం మధ్యాహ్నం 12.25 గంటలు. ర్యాలీ వేదిక సమీపంలో నాలుగు బాంబులను గుర్తించారు. అయితే గాంధీ మైదాన్‌లో పేలుళ్లకు కొన్ని గంటల ముందు, పాట్నా రైల్వే స్టేషన్‌లో కొత్తగా నిర్మించిన టాయిలెట్‌లో నాటు బాంబు పేలింది.

Also read: విదేశాల​ నుంచి రాగానే వ్యాక్సినేషన్​పై ప్రధాని మోదీ కీలక సమీక్ష.. ఆ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడనున్న మోదీ..

ఇక, పేలుళ్లతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలతో పరుగులు తీశారు. గాయపడ్డ వారిని చుట్టుపక్కల వారే వెంటనే ఆస్పత్రికి తరలించారు. పేలుళ్లు జరిగిన కొద్ది సేపటికి సభా ప్రాంగణానికి వచ్చిన మోడీ సభను కొనసాగించారు. అక్కడ తొక్కిసలాట చోటుచేసుకోకుండా మోదీ, ఇతర బీజేపీ నేతలు ర్యాలీని ముందుకు తీసుకెళ్లారు. ఆ సమయంలో  మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా  ఉన్నారు. 

2013 నవంబర్ 6వ తేదీన జాతీయ దర్యాప్తు సంస్థ ఈ కేసు విచారణ చేపట్టింది. 2014 ఆగస్టులో 11 మంది నిందితులపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో అనుమానితులుగా ఇండియన్ ముజాహిద్దీన్‌కు చెందిన తొమ్మిది మందిని, స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఎంఐ)కు చెందిన ఒక వ్యక్తిని గుర్తించి ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. నిందితుల్లో ఒకరు మైనర్ కావడంతో..అతడి కేసును జువైనల్ కోర్టుకు బదిలీ చేసింది. మిగిలిన 10 మందిలో 9 మందిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం.. వారికి నేడు శిక్షలు ఖరారు చేసింది.

click me!