టెలికాం రంగంలోకి కూడా ‘పతంజలి’

First Published May 28, 2018, 2:48 PM IST
Highlights


త్వరలో స్వదేశీ సిమ్ కార్డ్ లను ప్రవేశపెడతామంటున్న రాందేవ్ బాబా


స్వదేశీ బ్రాండ్ తో మార్కెట్లోకి అడుగుపెట్టింది ‘ పతంజలి’. మొదట నూడిల్స్ తో మొదలైన పతంజలీ.. తర్వాత సబ్బులు, షాంపూలు.. ప్రతి నిత్యవసర వస్తువులను అందించే స్థాయికి ఎగిసింది. త్వరలోనే వస్త్ర ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టబోతున్నామని.. స్వదేశీ జీన్స్ తయారు చేస్తామని యోగా గురువు రాందేవ్ బాబా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా పతంజలి టెలికాం రంగంలోకి అడుగుపెట్టబోతోంది.

ఎయిర్ టెల్, ఐడియా, జియో వంటి నెట్ వర్క్ లకు పోటీగా స్వదేశీ సిమ్ కార్డులను ప్రవేశపెట్టనున్నట్లు రాందేవ్ బాబా తెలిపారు. ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌తో కలిసి స్వదేశీ సమృద్ధి పేరుతో సిమ్‌కార్డులను తీసుకొస్తున్నారు.

పతంజలి స్వదేశీ సిమ్‌ కార్డు ద్వారా దేశ వ్యాప్తంగా అపరిమిత ఉచిత వాయిస్‌కాల్స్‌ చేసుకోవచ్చు. దీంతో పాటు, 2జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లను రూ.144కే పొందవచ్చు. ఈ పథకం పూర్తిగా అమల్లోకి వచ్చిన తర్వాత సిమ్‌కార్డు కొనుగోలు చేసిన వారు పతంజలి ఉత్పత్తులపై 10శాతం రాయితీని పొందవచ్చు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

ఈ సిమ్‌కార్డుతో పలు ప్రయోజనాలను కూడా పతంజలి అందించనుందని వార్తా ఏజెన్సీ ఏఎన్‌ఐ పేర్కొంది. రూ.2.5లక్షల నుంచి రూ.5లక్షల వరకూ ఆరోగ్య బీమా, ప్రమాదబీమాల ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయనుంది. ‘దేశవ్యాప్తంగా ఉన్న 5లక్షల బీఎస్‌ఎన్‌ఎల్‌ కౌంటర్ల ద్వారా పతంజలి స్వదీశీ సిమ్‌కార్డులను పొందవచ్చు’ అని రాందేవ్‌ బాబా అన్నారు.

‘బీఎస్‌ఎన్‌ఎల్‌ అందించే ఉత్తమమైన పథకాల్లో పతంజలి ప్లాన్‌ ఒకటి. రూ.144కే దేశంలో ఎక్కడికైనా, ఏ నెట్‌ వర్క్‌కైనా అపరిమిత ఉచితకాల్స్‌, 2జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు పొందవచ్చు. పతంజలి సభ్యులు తమ గుర్తింపు కార్డును బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో చూపిస్తే సిమ్‌ కార్డు యాక్టివేట్‌ అవుతుంది’ అని బీఎస్‌ఎన్‌ఎల్‌ జనరల్‌ మేనేజర్‌ సునీల్‌ గార్గ్‌ పేర్కొన్నట్లు ఏఎన్‌ఐ తెలిపింది.

click me!