విమానంలో టాయిలెట్‌లో ఓ ప్రయాణీకుడు 100 నిమిషాల పాటు గడిపాడు. టాయిలెట్ నుండి బయటకు వచ్చిన అతడిని ఆసుపత్రికి తరలించారు.
బెంగుళూరు:ముంబై-బెంగుళూరు విమానంలో ఓ ఘటన తో ఓ ప్రయాణీకుడు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. టాయిలెట్ లో వెళ్లిన ఓ ప్రయాణీకుడు 100 నిమిషాల పాటు టాయిలెట్‌లోనే ఉన్నాడు. డోర్ లాక్ పనిచేయని కారణంగా టాయిలెట్ లోపలే ప్రయాణీకుడు చిక్కుకున్నాడు.
మంగళవారంనాడు బెంగుళూరులోని కెంపేగౌగ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
మంగళవారంనాడు తెల్లవారుజామున ముంబై విమానాశ్రయం నుండి బయలుదేరిన ఎస్ జీ-268 విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సోమవారం నాడు రాత్రి 10:55 గంటలకు బయలుదేరాల్సిన విమానం ఆలస్యంగా బయలుదేరింది.
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం మేరకు 14 డీ సీటులో కూర్చున్న ప్రయాణీకుడు టేకాఫ్ అయిన కొద్దిసేపటికి టాయిలెట్ లోకి వెళ్లాడు. అయితే దురదృష్టవశాత్తు టాయిలెట్ డోర్ పనిచేయలేదు.దీంతో అతను విమానంలోనే చిక్కుకున్నాడు.
టాయిలెట్ లో చిక్కుకున్న ప్రయాణీకుడిని బయటకు తీసుకు వచ్చేందుకు విమానంలోని ఇతర ప్రయాణీకులు కూడ ప్రయత్నించారు. టాయిలెట్ డోర్ ను బయట నుండి ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ, డోర్ ఓపెన్ కాలేదు.
అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని విమాన సిబ్బంది హామీ ఇచ్చారు. టాయిలెట్ లో చిక్కుకున్న ప్రయాణీకుడికి ల్యాండింగ్ లో ఇంజనీర్ సహాయం చేస్తారని తెలిపారు. కమోడ్ మూతను మూసివేసి దానిపై సురక్షితంగా కూర్చోవాలని విమాన సిబ్బంది సూచించారు.
మంగళవారంనాడు తెల్లవారుజామున 3:42 గంటలకు విమానం ల్యాండ్ అయింది. రెండు గంటల పాటు ఇంజనీర్లు శ్రమించి టాయిలెట్ లో చిక్కుకున్న ప్రయాణీకుడిని బయటకు తీసుకు వచ్చారు. టాయిలెట్ లో చిక్కుకున్న ప్రయాణీకుడిని ప్రథమ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.