
అక్రమ రవాణాను అరికట్టేందుకు కస్టమ్స్ అధికారులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. అక్రమార్కులు ఏమాత్రం తగ్గడం లేదు. సినిమాల్లో చూపించే విధంగానే విభిన్న మార్గాల్లో అక్రమంగా రవాణా చేసుందుకు ప్రయత్నించి.. పట్టుబడుతున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వీట్ బాక్స్ కలకలం రేగింది. ఓ ప్రయాణికుడి దాదాపు 54 లక్షల విదేశీ కరెన్సీ స్వీటు బాక్స్ లో దాచిపెట్టి ఢిల్లీ నుంచి దుబాయ్‌కు తీసుకెళ్తున్నాడు. ఆ ప్రయాణికుడు అనుమానస్పదంగా వ్యవహరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకెళ్తే.. బుధవారం ఉదయం 6.46 గంటలకు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 3 వద్ద ఓ ప్రయాణికుడి కదలికలు అనుమానస్పదంగా కనిపించాయి. దీంతో భద్రతా సిబ్బంది అతని లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేసింది. ఆ తనిఖీల్లో వారు స్వీట్ల పెట్టెలో దాచిన సుమారు 2,50,000 సౌదీ రియాల్స్ గుర్తించారు. అదే సమయంలో ఓ బ్యాగ్ ను కూడా విదేశీ కర్సెన్సీ పెట్టినట్టు గుర్తించారు. ఆ నిందితుడి పేరు జస్వీందర్ సింగ్ అనీ, అతడు ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఆ నిందితుడు ఎవరికీ అనుమానం రాకుండా.. బ్యాగ్ లోపలి వైపు పొరలలో, స్వీట్ల బ్యాక్స్ లో సౌదీ రియాల్స్ దాచి ఉంచినట్లు అధికారులు తెలిపారు.
నిందితుడు జస్వీందర్‌ను ప్రశ్నించగా.. అతను ఎలాంటి సంతృప్తికరమైన సమాధానం గానీ, కరెన్సీకి సంబంధించిన పత్రాలను గాని అందించలేదని అధికారులు తెలిపారు. అతని నుంచి దాదాపు 54 లక్షల రూపాయల విలువైన 2,50,000 సౌదీ రియాల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ల్యాప్‌టాప్ బ్యాగుల్లో 45 లక్షల విదేశీ కర్సెన్సీ.. ఇద్దరు ప్రయాణికుల అరెస్టు
కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 45 లక్షల విదేశీ నోట్లతో ఇద్దరు ప్రయాణికులను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) పట్టుకుంది. ఈ ప్రయాణికులు ల్యాప్‌టాప్ బ్యాగుల్లో నోట్లను దాచి దేశం వెలుపలికి తీసుకెళ్లాలనుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 3 వద్ద భద్రతా తనిఖీల్లో ఇద్దరు ప్రయాణికులు అనుమానస్పదంగా కనిపించడంతో వారిని సీఐఎస్‌ఎఫ్ అధికారులు తనిఖీ చేశారు. వారి ట్రాలీ బ్యాగులు, ల్యాప్‌టాప్ బ్యాగ్‌లను తనిఖీ చేయగా అందులో 56200 అమెరికన్ డాలర్లు, 3200 దిర్హమ్‌లు ఉంచినట్లు గుర్తించారు. అరెస్టయిన ప్రయాణికులను మొహ్సిన్ సైఫీ, అసిమ్‌లుగా గుర్తించారు.