
Onam festival 2022: కేరళతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఓనం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం ఉదయం నుంచి కేరళలోని ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. మలయాలీల నూతన సంవత్సరమైన ఓనం పండుగను పది రోజుల పాటు ఘటనంగా జరుపుకుంటారు. కేరళ సంస్కృతి ఉట్టిపడేలా దేశంలో ఉన్న మళయాలీలు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులు ప్రజలకు ఓనం శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఓనం పండుగ శుభాకాంక్షలు తెలిపారు .
"తోటి పౌరులకు, ప్రత్యేకంగా మలయాళీ సోదరీమణులు, సోదరులకు ఓనం శుభాకాంక్షలు. కొత్త పంటను గుర్తుచేసే పండుగ, ఓనం సమానత్వం, న్యాయం-సత్యం విలువలను కూడా జరుపుకుంటుంది. ఈ పండుగ సంతోషకరమైన స్ఫూర్తి సామాజిక సామరస్యాన్ని బలోపేతం చేసి అందరికీ శాంతి-శ్రేయస్సును అందించాలని కోరుకుంటున్నాను" అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
"ప్రపంచమంతటా వ్యాపించిన కేరళ ప్రజలకు-మలయాళీ సమాజానికి ప్రతి ఒక్కరికీ ఓనం శుభాకాంక్షలు. ఈ పండుగ ప్రకృతి మాత కీలక పాత్రను, కష్టపడి పనిచేసే మన రైతుల ప్రాముఖ్యతను పునరుద్ఘాటిస్తుంది. మన సమాజంలో సామరస్య స్ఫూర్తిని కూడా ఓనం మరింతగా పెంపొందించాలి అని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ మరియు ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా దక్షిణాది రాష్ట్ర ప్రజలకు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలకు ఓనం శుభాకాంక్షలు తెలిపారు.