పార్లమెంటు సమావేశాలు ప్రారంభం: 18వ లోక్‌సభ ప్రత్యేకతలివే... కొత్త ఎంపీలు, మహిళా సభ్యులు ఎంతమందో తెలుసా..?

By Galam Venkata Rao  |  First Published Jun 24, 2024, 11:49 AM IST

భారత్ లో 18వ లోక్ సభ కొలువుదీరింది. కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రమాణం చేయించేందుకు ఈ సమావేశాలు నిర్వహిస్తుండగా... రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఇంతకీ పార్లమెంటు ఏ పార్టీకి ఎంత బలం ఉందో తెలుసా..? 


దేశంలో 18 లోక్‌సభ కొలువుదీరింది. సోమవారం ఉదయం పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. 18వ లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు ఈ సమావేశాలు నిర్వహిస్తుండగా.... ప్రొటెం స్పీకర్‌గా సీనియర్‌ ఎంపీ భర్తృహరి మెహతాబ్‌ నియమితులయ్యారు. పార్లమెంటు సమావేశాలకు ముందు భర్తృహరితో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. కొత్త స్పీకర్‌ ఎన్నిక జరిగే వరకు ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మెహతాబ్‌ లోక్‌సభకు అధ్యక్షత వహిస్తారు. బుధవారం కొత్త స్పీకర్‌ పేరును ప్రధాని మోదీ ప్రకటించనుండగా.... స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక జరగనుంది. 

పార్లమెంటు చరిత్రలో ఇప్పటివరకు స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవంగానే జరిగింది. స్పీకర్‌ పదవి అధికార పక్షం, డిప్యూటీ స్పీకర్‌ పదవి విపక్షం చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఈసారి అధికార పక్షం ఎన్‌డీయే బొటాబొటి మెజారిటీతో నెగ్గింది. ఈ నేపథ్యంలో తమకు డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇస్తేనే స్పీకర్‌ ఎన్నికకు మద్దతు తెలుపుతామని ఇండి కూటమి పట్టుపడుతోంది. దీంతో స్పీకర్‌ ఏకగ్రీవ ఎన్నిక సంప్రదాయానికి ఈసారి బ్రేక్‌ పడేలా ఉంది. 

Latest Videos

ఇవాళ (సోమవారం) ప్రారంభమైన 18వ లోక్‌సభ తొలి సమావేశాలు జులై 3వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నెల 24, 25 తేదీల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. 27న లోక్‌సభ, రాజ్యసభను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం చేస్తారు. ఆ తర్వాత 28 నుంచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై పార్లమెటులో చర్చ జరుగుతుంది. ఇక, జులై 2 లేదా 3వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఈ చర్చకు బదులిస్తారు. 

విశేషాలివే....
18వ లోక్‌సభలో మొత్తం 543 మంది సభ్యులు ఉన్నారు. 
లోక్‌సభలో ఈసారి 41 పార్టీల సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
543 మందిలో తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన వారు 280 మంది.
262 మంది సీనియర్‌ ఎంపీలు ఉన్నారు.  
గత లోక్‌సభలో సభ్యులుగా ఉన్న 216 మంది తిరిగి ఎన్నికయ్యారు.
53 మంది కేంద్ర మంత్రుల్లో 35 మంది తిరిగి ఎంపీలుగా ఎన్నికయ్యారు.
మహిళా ఎంపీలు 74 మంది ఉన్నారు.
ఏపీ, తెలంగాణ నుంచి 42 మంది లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 
ఆంధ్రప్రదేశ్‌ నుంచి 25 మంది, తెలంగాణ నుంచి 17 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు. 
ఏపీలో టీడీపీ ఎంపీలు 16 మంది, బీజేపీ ఎంపీలు ముగ్గురు, జనసేన సభ్యులు ఇద్దరు, వైసీపీ సభ్యులు నలుగురు ఉన్నారు. 
తెలంగాణంలో కాంగ్రెస్‌, బీజేపీ చెరో 8మంది  ఎంపీలు, ఎంఐఎం ఎంపీ ఒకరు ఉన్నారు. 


పార్టీల వారీగా సభ్యులు ఇలా...
బీజేపీ - 240
కాంగ్రెస్‌ - 99
సమాజ్‌వాదీ - 37
తృణమూల్‌ కాంగ్రెస్‌ - 29
డీఎంకే - 22
తెలుగుదేశం పార్టీ - 16
జనతాదళ్‌ (యునైటెడ్‌) - 12
శివసేన (ఉద్ధవ్‌ థాక్రే)- 9
ఎన్‌సీపీ (శరద్‌ పవార్‌) - 8
శివసేన - 7
లోక్‌ జనశక్తి - 5
వైసీపీ - 4, ఆర్జేడీ - 4, సీపీఎం - 4
ముస్లిం లీగ్‌ (ఐయుఎంఎల్‌) - 3, ఆప్‌ - 3
ఝార్కండ్‌ ముక్తి మోర్చా - 3
జనసేన - 02, సీపీఐ (ఎంఎల్‌) - 02, జేడీఎస్‌ - 02, సీపీఐ - 02, స్వతంత్రులు - 07 

18వ లోక్‌సభలో 543 మంది సభ్యులు ఉండగా... రెండు రోజులపాటు వారు ప్రమాణం చేయనున్నారు. గంటకు 26 మంది ఎంపీలు ప్రమాణం చేయనుండగా.. సోమవారం 280 మంది ప్రమాణం చేస్తారు. మంగళవారం మిగిలిన సభ్యులు ప్రమాణం చేస్తారు. 
 

click me!