నీట్‌ పరీక్ష వివాదమేంటి? నీట్‌ పీజీ పరీక్షను ఎందుకు రద్దైంది..?

By Galam Venkata Rao  |  First Published Jun 23, 2024, 1:56 PM IST

ఈ ఏడాది నిర్వహించిన నీట్ పరీక్షపై వివాదాలు కోకొల్లలు. పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణలో గందరగోళం, అసాధారణ స్థాయిలో విద్యార్థులకు టాప్ ర్యాంకులు, గ్రేస్ మార్కులు.. ఇలా అన్నీ వివాదాస్పమే. అసలిలా ఎందుకు జరిగింది...? ఎవరు బాధ్యులు..? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది..? 


నీట్‌.. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. మన దేశంలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులు, దంత వైద్యవిద్యా కోర్సులు చదవాలనుకునే విద్యార్థుల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష ఇది. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలన్నిటికీ ఈ పరీక్ష వర్తిస్తుంది. దీన్ని గతంలో ఆల్ ఇండియా ప్రీ- మెడికల్ టెస్ట్ అని పిలిచేవారు. దేశంలో నిర్వహించే అతిపెద్ద ప్రవేశపరీక్షల్లో నీట్ ఒకటి. ఈ పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహిస్తుంది. 

ఎందుకు వివాదమైంది..?
ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా లక్షలాది మంది విద్యార్థులు నీట్‌ రాశారు. మే 5న దేశ వ్యాప్తంగా నిర్వహించిన పరీక్షకు దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే, ఈసారి నీట్‌ క్వశ్చన్‌ పేపర్‌ లీకేజీ, సాధారణం కంటే ఎక్కువ మందికి టాప్‌ ర్యాంకులు రావడం వివాదాస్పదమైంది. 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించారు. ఇంకా చాలా మంది 718, 719 మార్కులు సాధించారు. అలాగే, ఒక్కో రాష్ట్రంలో విద్యార్థులకు రెండేసి సెట్ల ప్రశ్నపత్రాలు ఇవ్వడంతో గందరగోళం నెలకొంది. చాలా చోట్ల ఆలస్యంగా ప్రశ్నపత్రం ఇవ్వడంతో విద్యార్థులు సమయం కోల్పోయారు. అనేక మంది విద్యార్థులు 10 నుంచి 20 ప్రశ్నలకు సమాధానాలు రాయలేకపోయారు. 

Latest Videos

undefined

అలాగే, నీట్‌-యూజీ ఫలితాలు వెలువడిన తర్వాత అనేక వివాదాలు చెలరేగాయి. 67 మంది విద్యార్థులు టాప్ ర్యాంకు (700/700 మార్కులు) సాధించడం, 1,563 మంది విద్యార్థులకు 50 నుంచి 100 వరకు గ్రేస్‌ మార్కులు వేయడంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అసలు పరీక్ష నిర్వహణే లోపభూయిష్టంగా జరిగిందని అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై న్యాయస్థానాల్లో పిటిషన్లు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. సీబీఐ స్వతంత్రంగా దర్యాప్తు చేపట్టాలన్న డిమాండ్లు కూడా వెల్లువెత్తాయి. 

పరీక్షల రద్దు...
నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ)కి వ్యతిరేకంగా వెల్లువెత్తిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్‌గా స్పందించింది. నీట్ ఫలితాలకు వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణకు తీసుకుంది. ఈ క్రమంలో స్పందించిన ఎన్‌టీయే... నీట్‌-యూజీ పరీక్షను రద్దు చేస్తున్నట్లు జూన్ 14న సుప్రీంకోర్టుకు తెలిపింది. గ్రేస్‌ మార్కులు పొందిన విద్యార్థులకు రీఎగ్జామినేషన్‌ నిర్వహిస్తామని తెలిపింది. అయితే, విద్యార్థులకు ఎన్‌టీఏ ఓ ఛాయిస్‌ ఇచ్చింది. గ్రేస్‌ మార్కులు వద్దనుకున్నవారు రెండోసారి పరీక్ష రాయాల్సిన అవసరం లేదని ప్రకటించింది. 

జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నీట్‌ పరీక్షపై వివాదం చెలరేగడంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. వివాదాలపై విచారణకు ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని నియమించింది. ఇస్రో మాజీ ఛైర్మన్‌ కె.రాధాకృష్ణన్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. 

పేపర్‌ లీకేజీ, ఇతర వివాదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం జరగాల్సిన నీట్‌ పీజీ ప్రవేశ పరీక్షను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. అలాగే,, ఎన్‌టీఏ డైరెక్టర్‌ జనరల్‌ సుబోధ్‌ సింగ్‌ను ఆ పదవి నుంచి తప్పించింది. త్వరలో నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష తేదీని ప్రకటిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ వివాదంపై స్పందించిన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌.... విద్యార్థుల భవిష్యత్తే తమకు ప్రధానమని తెలిపారు. విద్యార్థులను దృష్టిలో పెట్టుకొనే నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ సహా అన్ని అంశాలకు సంబంధించి ఎన్‌టీఏ అధికారులందరూ పరిశీలనలో ఉన్నారని తెలిపారు. 

యూజీసీ-నెట్ కూడా రద్దు...

నీట్ తరహాలోనే యూజీసీ నెట్ (నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌) పరీక్షను కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీనే నిర్వహిస్తుంది. వివాదాల నేపథ్యంలో ఈ నెల 18న నిర్వహించిన యూజీసీ-నెట్ పరీక్షను కూడా రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. యూజీసీ నెట్ పరీక్షను దేశవ్యాప్తంగా సుమారు 9లక్షల మంది విద్యార్థులు రాశారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌, పీహెచ్‌డీల్లో ప్రవేశాలు, యూనివర్సిటీ, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలకు అర్హత సాధించాలంటే యూజీసీ నెట్ పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. 

click me!