Parliament sessions : కేంద్రంలో మోదీ 3.0 ప్రభుత్వం కొలువుదీరిన కొద్దిరోజుల్లోనే తొలి పార్లమెంటు సమావేశాలకు ముహూర్తం ఫిక్సయింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజుజు ప్రకటించారు. ఈ నెల 24 నుంచి వచ్చే నెల (జూన్) 3వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు జరుగుతాయని వెల్లడించారు. ఈ సమావేశాల్లోనే 18వ లోక్ సభకు కొత్త స్పీకర్ ఎన్నిక, ఎంపీల ప్రమాణం జరుగుతుందని తెలిపారు.
18వ లోక్ సభ తొలి సమావేశాలు జూన్ 24 నుంచి జులై 3వ తేదీ వరకు జరుగనుండగా... తొలి మూడు రోజులు కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అదే సమయంలో ఎంపీలంతా స్పీకర్‌ను ఎన్నుకుంటారు. ఆ తర్వాత 27న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదేరోజు ప్రధాని మోదీ నేతృత్వంలో కొత్త కేంద్ర మంత్రివర్గాన్ని పరిచయం చేస్తారు. అనంతరం పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. అయితే, ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చింది విపక్షం. పార్లమెంటు వేదికగా మోదీ గత పాలనా వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధమవుతోంది.