
పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో మణిపూర్ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో ఉభయసభల్లో గందరగోళ పరిస్థితులు చోటుచేసుకుంది. దీంతో ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతుంది. మణిపూర్ ఘటనపై ప్రధాని మోదీ పార్లమెంట్ లోపల సమాధానం ఇవ్వాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. రూల్ 267 కింద చర్చ చేపట్టాలని రాజ్యసభలో ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. అయితే రూల్ 176 ప్రకారం స్వల్ప చర్చకు మాత్రం సిద్దమని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగా.. మణిపూర్ అంశంపై నిరసనలతో మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. అయితే మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి రాజ్యసభ ప్రారంభమైనప్పటికీ.. సభలో మళ్లీ అవే పరిస్థితులు నెలకొన్నాయి. మణిపూర్ ఘటనపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. సభలో నిరసనకు దిగాయి. ఈ క్రమంలోనే రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్‌ను పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మిగిలిన సెషన్‌కు సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అనంతరం సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. అయితే సభ వాయిదా పడిన అనంతరం ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఈ అంశంపై.. రాజ్యసభ చైర్మన్‌ను కలిసినట్టుగా తెలుస్తోంది.
లోక్‌సభ విషయానికి వస్తే.. ఉదయం 11 గంటలకు సభ కార్యకలాపాలు ప్రారంభమైన కొద్దిసేపటికే కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. ‘‘మేము మొదటి నుండి మణిపూర్ అంశాన్ని లేవనెత్తుతున్నాం. ప్రధానమంత్రి సభకు వచ్చి ప్రకటన ఇవ్వాలని కోరుతున్నాము’’ అని చెప్పొరు. ఇందుకు స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ.. సభ మొత్తం 12 గంటలకు చర్చను ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. అయితే ఎవరూ స్పందిస్తారనేది మీరు నిర్ణయించలేరని పేర్కొన్నారు.
ఇదే సమయంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ.. ‘‘మేము సిద్ధంగా ఉన్నాము, కానీ ప్రతిపక్షాలు అంగీకరించడానికి సిద్ధంగా లేవు’’ అని అన్నారు. ఈ క్రమంలోనే లోక్‌సభలో విపక్షాలు చర్చకు పట్టుబడుతూ నినాదాలు చేశాయి. దీంతో లోక్‌సభను స్పీకర్ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.
లోక్‌సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా మళ్లీ అదే పరిస్థితి కనిపించింది. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ ప్రకటన, చర్చ జరపాలని పట్టుబట్టడంతో లోక్‌సభ స్పీకర్ సభనను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.