
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో మణిపూర్ ఘటనపై విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో వాయిదాల పర్వం కొనసాగుతుంది. మణిపూర్ ఘటనపై ప్రధాని మోదీ పార్లమెంట్ లోపల సమాధానం ఇవ్వాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక, రూల్ 267 కింద చర్చ చేపట్టాలని రాజ్యసభలో ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. అయితే రూల్ 176 ప్రకారం స్వల్ప చర్చకు మాత్రం సిద్దమని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే సోమవారం తిరిగి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు వారి వారి వ్యూహాలను సిద్దం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఆవరణలో పోటాపోటీగా ఆందోళనలు నిర్వహించాయి. రాజస్థాన్‌లో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు, నేరాలకు వ్యతిరేకంగా బీజేపీ నిరసన తెలిసింది. ‘‘రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లాట్ రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. దళితులపై (మహిళలు) అఘాయిత్యాలు అరికట్టాలి. అఘాయిత్యాలు విపరీతంగా పెరిగాయి. అందుకే మేము ఇక్కడ పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు నిరసన చేస్తున్నాము’’ అని బీజేపీ ఎంపీ రవి కిషన్ చెప్పారు.
మరోవైపు పార్లమెంట్ ఉభయ సభల్లో మణిపూర్ ఘటననపై చర్చ జరగాలని, ప్రధాని మోదీ వివరణాత్మక ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు (ఐఎన్‌డీఐఏ) పార్లమెంట్ ఆవరణలో నిరసన వ్యక్తం చేశాయి. ఈ నిరసనల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు విపక్ష కూటమి సభ్యులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్‌పై పార్లమెంటు ఉభయసభల్లో సమగ్ర ప్రకటన చేయాలని, దాని తర్వాత లోక్‌సభలో వాయిదా నిబంధన 184, రాజ్యసభలో 267వ నిబంధన కింద చర్చ జరగాలని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ డిమాండ్ చేశారు.