
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 14వ తేదీ స్పెషల్ ఏమిటి? అని అడిగితే కుర్రకారుకు తప్పక జవాబిస్తుంది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే అనే సమాధానం వారి వద్ద సిద్ధంగా ఉంటుంది. కానీ, ఇక పై ఫిబ్రవరి 14వ తేదీ స్పెషల్ ఏమిటంటే.. కౌ హగ్ డే అని కూడా చెప్పాల్సి ఉంటుంది! పాశ్చాత్య సంస్కృతితో భారత్‌లో వేదకాల సంస్కృతి సంప్రదాయాలు దాదాపు అంతరించిపోయే దశకు చేరుకున్నాయని, కాబట్టి, ఫిబ్రవరి 14వ తేదీన గోమాత ఆలింగన దినోత్సవంగా గోవు ఆరాధకులు జరుపుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం ఓ అప్పీల్ చేసింది.
కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, డైరీ మంత్రిత్వ శాఖ పరిధిలోని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా సోమవారం ఓ అప్పీల్ చేసింది. ఈ ప్రకటనలో ఫిబ్రవరి 14వ తేదీన కౌ హగ్ డేగా జరుపుకోవాలని సూచనలు చేసింది. ‘భారత సంస్కృతి, గ్రామీణ ఆర్థికవ్యవస్థకు వెన్నెముకగా గోవు ఉంటుందని మనందరికి తెలిసిందే. గోవులు మన జీవిత పురోగతికి, పశు సంపద, జీవ వైవిధ్యతకు కీలకంగా ఉన్నది. ఆవులను కామధేనువు, గోమాత అని కూడా పిలుచుకుంటారు. ఎందుకంటే ఇది తల్లి స్వభావాన్ని కలిగి ఉంటుంది. మానవాళికి అవసరమైన వాటిని అందిస్తుంది’ అని ఈ అప్పీల్ పేర్కొంది.
Also Read: అసలు మనం వాలెంటైన్స్ డేను ఎందుకు జరుపుకుంటామో తెలుసా?
‘పాశ్చాత్య సంస్కృతి అభివృద్ధి చెందుతున్న కొద్దీ వేదకాల సంప్రదాయాలు దాదాపు అంతరించే దశకు చేరుకున్నాయి. ఈ పాశ్చాత్య సంస్కృతి మెరుపులతో మనం ఫిజికల్ కల్చర్, హెరిటేజ్‌ను దాదాపు మరిచిపోయాం’ అని ఈ అప్పీల్‌లో పశు సంక్షేమ బోర్డు తెలిపింది.
‘గోవు కలిగించే పుష్కల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వాటిని ఆలింగనం చేసుకోవడం ఎమోషనల్ రిచ్‌నెస్‌ను అందిస్తుంది. తత్ఫలితంగా వ్యక్తిగతంగా, సామూహికంగా సంతోషం వ్యాపిస్తుంది. కాబట్టి, గోవు ఆరాధాకులంతా ఫిబ్రవరి 14వ తేదీన కౌ హగ్ డేగా జరుపుకోవచ్చు. గోమాత ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ వేడుక చేసుకుంటే జీవితం సంతోషమయం, పాజిటివ్ ఎనర్జీతో నింపుకోవచ్చు’ అని వివరించింది.