పార్లమెంట్‌లో మళ్లీ అదే సీన్.. విపక్షాల ఆందోళనతో ఉభయసభలు వాయిదా..

By Sumanth KanukulaFirst Published Feb 3, 2023, 12:01 PM IST
Highlights

పార్లమెంట్‌ సమావేశాల్లో మరోసారి గందరగోళం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగానే.. ఉభయసభల్లో విపక్షాలు నిరసనకు దిగాయి. 

పార్లమెంట్‌ సమావేశాల్లో మరోసారి గందరగోళం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగానే.. ఉభయసభల్లో విపక్షాలు నిరసనకు దిగాయి. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ నివేదికలో లేవనెత్తిన ఆరోపణలపై విచారణకు సుప్రీంకోర్టు లేదా జాయింట్ పార్లమెంటరీ కమిటీ పర్యవేక్షణలో నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే ఉభయసభలు వాయిదా పడ్డాయి. లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడగా, రాజ్యసభ మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా పడింది. 

ఇక, శుక్రవారం ఉదయం 10 గంటలకు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే పిలుపునిచ్చిన అత్యవసర సమావేశానికి 16 ప్రతిపక్ష పార్టీలు హాజరయ్యాయి. ఈ సందర్భంగా బడ్జెట్ సెషన్‌లో అనుసరించాల్సిన వ్యుహాంపై చర్చించాయి. పార్లమెంట్ భవనంలోని ఖర్గే ఛాంబర్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి కాంగ్రెస్, డీఎంకె, సమాజ్ వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, భారత రాష్ట్ర సమితి, శివసేన, రాష్ట్రీయ జనతాదళ్, జనతాదళ్ యునైటెడ్, సీపీఎం, సీపీఐ, ఎన్‌సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, కెసి (జోస్ మణి), కేసీ(థామస్), ఆర్‌ఎస్‌పీ సభ్యులు హాజరయ్యారు.

ఇదిలావుండగా.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌పై బీజేపీ ఎంపీలకు వివరించనున్నారు. ఇందుకు  లోక్‌సభ, రాజ్యసభలోని బీజేపీ సభ్యులందరూ హాజరయ్యే అవకాశం ఉంది.
 

click me!